భారతదేశంలో హైస్పీడ్ రైలులో ప్రయాణించాలనుకునేవారి కోరిక త్వరలో తీరనుంది. ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమై ఉన్న భారతీయ రైల్వే ఆదిశగా ఓ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.
భారతీయ రైల్వే తన తొలి సెమీ హైస్పీడ్ రైలును త్వరలో పట్టాలెక్కించనుంది. ఈ రైలు పేరు ట్రెయిన్ 18 (ఇండియాలో తయారీ పూర్తి చేసుకున్న ఏడాది పేరు మీద ఈ రైలుకు ఆ పేరు పెట్టారు). గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో కొత్త రైలును తీసుకురానున్నారని సమాచారం.
ట్రెయిన్ 18ను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేశారు. 'మేకిన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ఈ ట్రైన్²ను ఇండియాలోనే తయారుచేశారు. అయితే ముందుగా దీనిని ఓ ఇంటర్సిటీ ట్రెయిన్‌గా లాంఛ్ చేయనున్నారు.
ఈ రైలులో మొత్తం 16 చెయిర్ కార్ టైప్ కోచ్‌లు ఉంటాయి. అందులో రెండు ఎగ్జిక్యూటివ్, 14 నాన్ ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో గరిష్ఠంగా 56 మంది, నాన్ ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో గరిష్ఠంగా 78 మంది ప్రయాణికులు కూర్చునే వీలుంటుంది. కోచ్‌లన్నీ పూర్తి ఎయిర్ కండిషన్డ్‌తో ఉంటాయి. రైల్లో ఆటోమేటిక్ డోర్స్, వైఫై, ఇన్ఫోటైన్మెంట్, ముడుచుకొనే ఫుట్ స్టెప్స్, GPS ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థ, బయో వాక్యూమ్ టాయిలెట్స్, ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో ప్రయాణించే దిశ వైపు తిరిగే రోటేషనల్ సీట్లు, ఎల్ఈడీ లైటింగ్ తదితర ప్రత్యేకతలెన్నో ఈ ట్రెయిన్ 18 రైలుకు ఉన్నాయి.