కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే రైతుల రుణాల మాఫీపై బీఎస్ యడ్యూరప్ప ఓ ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల్లో రైతుల రుణ మాఫీ కూడా ఒకటి కావడంతో ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగానే యడ్యూరప్ప మొదటిగా రైతు రుణాలు మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ప్రస్తుతానికి ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటు కానుందున, రైతు రుణాల మాఫీకి సంబంధించిన ఉత్తర్వులు సైతం ఇంకా అధికారికంగా వెలువడలేదు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కాదని, బీజేపీ నేత యడ్యూరప్పను కర్ణాటక ముఖ్యమంత్రిని చేయడంపై కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎదుట నిరసన చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లట్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నిరసనలో పాల్గొనగా మాజీ ప్రధాని, జేడీఎస్ మాజీ అధినేత హెచ్.డి. దేవేగౌడ సైతం ఈ ఆందోళనలో పాల్పంచుకున్నారు.
కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటికీ.. అక్కడ కాంగ్రెస్‌కి అనుకూలమైన తీర్పు రాలేదు. గవర్నరే తన స్వీయ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే అధికారం కలిగి వుంటారు అని కోర్టు తేల్చిచెప్పడంతో అంతిమంగా గవర్నర్ వాజుభాయ్ వాలా నిర్ణయమే అనివార్యమైంది. అలా గవర్నర్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప.. ఆ తర్వాత అసెంబ్లీలో బల పరీక్ష నిరూపించుకోవాల్సి వుంది.