కరాటే మహిళా ఛాంపియన్ చేతిలో దెబ్బలు తిన్న పోలీసు

తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆగ్రహంతో ఓ పోలీసుపై పిడిగుద్దులు కురిపించి, అతడికి తగిన రీతిలో దేహశుద్ధి చేసింది ఓ మహిళా కరాటే ఛాంపియన్

Last Updated : Apr 7, 2018, 06:08 PM IST
కరాటే మహిళా ఛాంపియన్ చేతిలో దెబ్బలు తిన్న పోలీసు

ఆటోలో కలిసి ప్రయాణిస్తోన్న తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆగ్రహంతో హర్యానాకు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై పిడిగుద్దులు కురిపించి, అతడికి తగిన రీతిలో దేహశుద్ధి చేసింది ఓ యువతి. అరాచకాలను తిప్పికొట్టడానికి ఏ యువతీ వెనుకాడకూడదు. అటువంటిది ఆమె కరాటేలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని టైటిల్ సొంతం చేసుకున్న ఒక ఛాంపియన్ కూడా. తాను కరాటే ఛాంపియన్ అయ్యుండి తనపై మరొకరు చెయ్యేసి, వేధించాలని చూస్తే ఆమె ఊరుకుంటుందా ? అందుకే అతడికి తగిన విధంగా గుణపాఠం చెప్పిందామె. చండీఘడ్‌లో గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా వున్నాయి. చండీఘడ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం కరాటే క్లాస్ ముగించుకుని ఇంటి బాట పట్టిన ఆ యువతి రోడ్డుపై ఓ ఆటో రిక్షా ఎక్కింది. అదే ఆటో రిక్షా ఎక్కిన ట్రాఫిక్ కానిస్టేబుల్ యాసిన్.. ఆమెని ఏదో ఓ విధంగా మాటల్లో పెట్టి ఫోన్ నెంబర్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అందుకు యువతి నిరాకరించడంతో ఆమెపై ఆటోలోనే లైంగిక వేధింపులకి పాల్పడటం మొదలుపెట్టాడు. పరిస్థితి చేయిదాటిపోతోంది అని గ్రహించిన బాధితురాలు వెంటనే అతడి దుశ్చర్యలకు అడ్డుచెబుతూ తనని తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కానిస్టేబుల్‌పై తన కరాటే ప్రతాపం చూపించింది. అనంతరం అదే ఆటోలో మహిళా పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయగా అక్కడ కూడా ఆమెకి ఓ చేదు అనుభవం ఎదురైంది.

మహిళలకు న్యాయం చేసేందుకే పుట్టుకొచ్చిన మహిళా పోలీసు స్టేషన్‌లోనే మరో మహిళా పోలీస్ ఆఫీసర్ చేతిలో ఆమె ఫిర్యాదు తిరస్కరణకు గురైంది. తాను కానిస్టేబుల్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పి నమ్మించిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్.. ఆ ఫిర్యాదును పక్కనపెట్టింది. దీంతో రోహ్‌తక్ ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు.. అక్కడ తనకు జరిగిన అన్యాయంపై మొరపెట్టుకుంది. 

బాధితురాలి ఫిర్యాదు అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ యాసిన్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. అనంతరం అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. బాధితురాలి ఫిర్యాదుని స్వీకరించనందుకు క్రమశిక్షణ చర్యల కింద మహిళా పోలీస్ ఆఫీసర్‌ని అక్కడి నుంచి మరో చోటుకు బదిలీ చేశారు. 

Trending News