మీ ఊళ్లో .. ఎమ్మెల్యే వచ్చినప్పుడు .. లేదా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు .. అధికారులు ఏం చేస్తారో గుర్తుందా.. ? అవును .. మీరు ఊహించింది కరెక్టే. ప్రజాప్రతినిధి వస్తున్నప్పుడు దోమలు రాకుండా పౌడర్ చల్లుతారు. రోడ్లన్నీ శుభ్రం చేస్తారు. సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్, గుజరాత్ అధికారులు అదే చేస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత దేశానికి వస్తున్నారు. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంతోపాటు యూపీలోని ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. ఈ క్రమంలో అక్కడి అధికారులు.. మన ఊళ్లల్లో చేసిన విధంగానే చేశారు. గుజరాత్ లోని ఓ మురికివాడ అగ్రరాజ్యాధినేతకు కనిపించకుండా .. ఏకంగా గోడ కట్టేశారు. గతంలో ఇలాంటి ప్రముఖులు అక్కడి ప్రాంతానికి వచ్చినప్పుడు .. తెరలు కట్టేవారని మురికివాడలో నివసిస్తున్నవారు చెప్పారు. ఇప్పుడు వస్తున్నది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కావడంతో ఏకంగా గోడ కట్టేశారు.
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అధికారుల వంతు వచ్చేసింది. డోనాల్డ్ ట్రంప్.. ఉత్తరప్రదేశ్ లోని తాజ్ మహల్ ను కూడా సందర్శించనున్నారు. ఈ క్రమంలో పక్కనే మురికి కూపంలా ఉన్న యమునా నది నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు. యమునా నదిలోకి నీరు ఎక్కువగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆయన ముక్కుపుటాలు అదిరిపోకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఇలాగే చేశారు. డోనాల్డ్ ట్రంప్ గారాలపట్టి ఇవాంకా ట్రంప్ .. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. అప్పుడు ఆమె.. చారిత్రక గోల్కొండ కట్టడాన్ని చూశారు. ఈ క్రమంలో ఆమె వచ్చే కంటే రెండు రోజుల ముందుగానే .. అక్కడ దోమలు చంపే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. అంటే ఏళ్ల తరబడి అదే ప్రాంతాలలో నివసిస్తున్న వారిని పట్టించుకోరు కానీ .. కొద్ది గంటల కోసం వీఐపీలు వచ్చినప్పుడే అధికారులు స్పందిస్తారు. అందుకే జనం కూడా .. ఎప్పుడెప్పుడు తమ ప్రాంతాల్లో వీఐపీలు పర్యటిస్తారా..? అని ఎదురు చూసే పరిస్థితులు వస్తాయి.