ఉద్యోగం లేదన్నారు.. చనిపోయేందుకు అనుమతైనా ఇవ్వండి : ట్రాన్స్‌జెండర్ మహిళ

సెల్ఫ్ కిల్లింగ్‌కి అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్రపతికి ట్రాన్స్‌జెండర్ మహిళ పిటిషన్ 

Last Updated : Feb 15, 2018, 04:08 PM IST
ఉద్యోగం లేదన్నారు.. చనిపోయేందుకు అనుమతైనా ఇవ్వండి : ట్రాన్స్‌జెండర్ మహిళ

ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని, అక్కడి సిబ్బంది నుంచి తిరస్కరణకు గురైన ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ.. తనని తాను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆమె రాష్ట్రపతి కార్యాలయానికి ఓ పిటిషన్ పెట్టుకున్నారు. 

ఎయిర్ ఇండియాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న తనకు అక్కడి అధికారుల నుంచి చేధు అనుభవం ఎదురైంది. ట్రాన్స్ జెండర్ మహిళల కోసం ఇక్కడ ఎటువంటి కోటా లేదని తన అభ్యర్థనను తిరస్కరించారు. అటువంటప్పుడు ఇక తాను బతికి వుండి ప్రయోజనం లేదని, తనని తాను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలి అని రాష్ట్రపతికి పిటిషన్ లో పేర్కొన్నారు పొన్ను స్వామి. 

తమిళనాడులోని తూతుక్కుడు జిల్లా తిరుచెండూరుకి చెందిన శానవి పొన్ను స్వామి అనే ట్రాన్స్‌జెండర్ మహిళ.. ఎయిర్ ఇండియా తీరుపై పరోక్షంగా తన నిరసన తెలపడమే కాకుండా, తనలా ఉద్యోగం కోసం ప్రయత్నించే ట్రాన్స్‌జెండర్ మహిళలు ఎదుర్కుంటున్న ఇబ్బందులని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లేందుకు చేసిన ప్రయత్నమే ఈ సెల్ఫ్ కిల్లింగ్ పిటిషన్. ' తనకు ఎయిర్ ఇండియాలో ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు వున్నాయి.. తగిన అనుభవం వుంది. అటువంటప్పుడు తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వరు ?' అని ప్రశ్నించిన శానవి పొన్ను స్వామి.. తాను ట్రాన్స్‌జెండర్ మహిళను అయిన కారణంగానే తనకు ఉద్యోగం తిరస్కరించినట్టయితే, తాను ఇక బతికి వుండి లాభం లేదని తన లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు. 

ఎయిర్ ఇండియాలో ఉద్యోగం కోసం ప్రయత్నించి భంగపాటుకు గురైన తర్వాత తాను మరే ఇతర ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు. ఎందుకంటే ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా వాళ్లే తనని ట్రాన్స్‌జెండర్ మహిళ కోటా లేదని వెనక్కి పంపిస్తే, ఇక ఇతర సంస్థల పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే తనకు ఇక బతకాలని లేదు అని రాష్ట్రపతికి పెట్టుకున్న అర్జీలో పేర్కొన్నారామె.

Trending News