గుజరాత్‌లో కమల వికాసం.. హస్త విలాపం ?

ఎగ్జిట్ పోల్ రిజల్డ్స్‌ను ప్రామాణికంగా తీసుకొని ఫలితాన్ని ఊహించవచ్చా ?

Last Updated : Dec 17, 2017, 12:48 PM IST
గుజరాత్‌లో కమల వికాసం.. హస్త విలాపం ?

గుజరాత్‌లో ఎన్నికల ఫలితాలకు ముందే ఫలితం తేలిపోయింది. అదెలా అనుకుంటున్నారా..? అదేనండి.. మన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు కోడై కూస్తున్నాయి. ఒక్కటి కాదు ..రెండు కాదు..ఎగ్జిట్ పోల్స్ అన్ని గెలుపు గుర్రం కమలమేనని చెబుతున్నాయి. ఒక్క ఏబీపీ మినహా అన్ని సర్వేలు 100కి పైగా స్థానాలు బీజేపీ దక్కించుకుంటుందని చెబుతున్నాయి. గుజరాత్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు సాధించాల్సి ఉంది.  కాగా ఈ ఫలితాలు కొందరికి సంతోషాన్ని కలిగిస్తుండగా..మరికొందరిని నిరాశలో ముంచెతుతున్నాయి. 

కమలనాధుల్లో హుషారు...

ఎగ్జిట్ ఫలితాలు ఏకపక్షంగా రావడంతో ఫలితాలు రాకముందే కమలనాధులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. 22 ఏళ్ల నుంచి గుజరాత్  రాష్ట్రంలో బీజేపీ పాగా వేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం.. కమలం పార్టీ విజయంపై ఎలాంటి అనుమానాలు ఉండేవి కావు. అయితే ఆయన ప్రమోట్ అయి ప్రధానిగా వెళ్లడంతో అక్కడ సమర్థ నాయకత్వం కొరవడింది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత, రిజర్వేషన్ల కోసం కొన్ని వర్గాల పోరుబాట..ఇలా అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఎన్నికల సమయంలో వీటన్నింటిని ఎలా అధిగమిస్తామని ఆ పార్టీ నేతల్లో ఒకింత భయం నెలకొంది. ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనతో అక్కడ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. 
 
కాంగ్రెస్ వాదులు బేజారు..

ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మింగుపడని విధంగా పరిణమిస్తున్నాయి. ఎందుకుంటే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది హస్తం పార్టీ. రిజర్వేషన్ల డిమాండ్ల నేపథ్యంలో పటేళ్ల వర్గంతో పాటు బీసీ,దళిత వర్గాలకు  దగ్గరయ్యేందుకు ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్ అక్కడే మకాం వేసి ప్రయత్నాలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి అక్కడ గ్రాఫ్ పెరిగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే దీనికి భిన్నంగా ఎగ్జిట్ ఫోల్ ఫలితాలన్నీ వ్యతిరేకంగా రావడంతో ఆ పార్టీలో నిరాశ నెలకొంది. పైకి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నపటికీ..అది మేకపోతు గాంభీర్యంలాగే కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్‌కు..ఈ పార్టీకి చెందిన మణిశంకర్ రూపంలో గట్టి దెబ్బ తగిలింది. ఆయన ప్రధాని మోడీని అసభ్య పదజాలంతో దూషించడం వంటి పరిణామం  హస్తం పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా మణిశంకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా..ఫలితం అంతగా కనిపించలేదు. దీనికి తోడు మోడీ ప్రయోగించిన పాకిస్తాన్ అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి....

ఏదైనా జరగవచ్చు..

వాస్తవానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోలేం..ఎందుకంటే గతంలో ఈ ఫలితాలు తారుమారైన ఘటనలు కూడా ఉన్నాయి...గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందుకు మంచి ఉదాహరణ. ఆ ఎన్నికల్లో  జయలలిత పార్టీ  ఓడిపోతుందని..డీఎంకే అధికారం కైవసం చేసుకుంటుందని సర్వేలు కోడై కూశాయి. అయితే ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. కాబట్టి గుజరాత్ ఎన్నికల విషయంలో కూడా ఇలాంటి సంచలనాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే అప్పట్లో మెజార్టీ సర్వేలు డీఎంకే అధికారంలోకి వస్తాయని చెప్పాయి.కానీ పూర్తి స్థాయిలో సర్వేలన్నీ ఒకే వాదన వినిపించలేదు..అయితే గుజరాత్ ఎన్నికల విషయంలో అన్నీ సర్వేలు కమలం పార్టీయే అధికారం కైవసం చేసుకుంటుందని చెబుతున్నాయి.. ఇలాంటి భిన్న వాదనల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Trending News