గిన్నిస్ రికార్డుపై అయోధ్యవాసుల గురి

   

Last Updated : Oct 18, 2017, 05:10 PM IST
గిన్నిస్ రికార్డుపై అయోధ్యవాసుల గురి

దీపావళి సందర్భంగా అయోధ్యలో దాదాపు 2 లక్షల దీపాలను ఒకేసారి వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు కోసం ప్రయత్నించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ దీపాలను వెలిగించే కార్యక్రమంలో 2000 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొననున్నారు. బుధవారం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఒక్కో విద్యార్థి 40 దీపాలను వెలిగిస్తారని, ఈ కార్యక్రమ కమిటీ తెలిపింది. తొలి దీపాన్ని వెలిగించి యూపీ సీఎం ఆదిత్యనాథ్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత రికార్డుకు సంబంధించిన ముఖ్య ఘట్టం ప్రారంభమవుతుంది. ఈ రికార్డు పొందాలంటే ఒక్కో దీపం కనీసం అయిదు నిముషాలు వెలగాలి. 10 శాతం వరకు వెలుసుబాటును గిన్నిస్ నిర్వహకులు కల్పించారు. అంటే కనీసం 154,000 దీపాలు ఆ 5 నిముషాల వ్యవధిలో ఎలాంటి అంతరాయం లేకుండా వెలిగితే, కొత్త  రికార్డు నమోదు అవుతుంది.

గతంలో ఇదే రికార్డు గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఆధ్వర్యంలో నడిచే డేరా సచ్ఛా సౌదా పేరిట ఉంది. గత సంవత్సరం సెప్టెంబరు 23వ తేదీన డేరా సభ్యులు 1,50,009 దీపాలు వెలిగించి గిన్నిస్‌బుక్‌లో స్థానం పొందారు. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేసి, కొత్త రికార్డును నెలకొల్పే దిశగా ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది యూపీ ప్రభుత్వం. ఆ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌తో పాటు గవర్నరు రాం నాయక్ కూడా పాల్గొననున్నారు. అయోధ్య దివ్య దీప ఉత్సవ్ పేరిట ప్రారంభించే ఈ కార్యక్రమం సరయు ఘాట్, రామ్ కీ పౌరీ ఘాట్, రామ్ కథా పార్క్ ఏరియాలకు మూడు కిలోమీటర్ల దూరంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే అశేష జనవాహిని అయోధ్యకు చేరుకుంది. 

Trending News