భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరుకున్న టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అక్కడి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అంతకన్నా ముందుగా ఆదివారం ఉదయం సతీ సమేతంగా విశాఖ వెళ్లి అక్కడి శారద పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్.. అక్కడి నుంచే నేరుగా భువనేశ్వర్‌కి వెళ్లారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు బిజు జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌తో భేటీ కానున్న కేసీఆర్.. ఆయనతో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించనున్నారు. పట్నాయక్ నివాసంలో ఈ భేటీ జరగనుంది.
ఇవాళ రాత్రికి అక్కడే బస చేసి రేపు సోమవారం పూరీ జగన్నాథ్ దేవాలయం దర్శించుకోనున్నారు. అనంతరం కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శిస్తారు. తిరిగి భువనేశ్వర్ చేరుకున్న అనంతరం అక్కడి నుంచి సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్నారు. కోల్‌కతాలో సోమవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జితో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి ఢిల్లీలో పలువురు ఇతర పార్టీల అగ్రనేతలను కలవనున్నారని సమాచారం.