ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న కట్టడం తాజ్‌మహల్. అటువంటి తాజ్ మహల్ రంగు వెలిసిపోయి రోజు రోజుకీ అందవిహీనంగా మారుతుందని.. పురాతన కట్టడాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందని.. ఈ విషయంపై వెంటనే వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశానికి గర్వకారణమైన కట్టడం పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా ప్రశ్నించింది.
"ఇప్పటికిప్పుడు ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిందే. వెంటనే దేశ, విదేశాల నుండి నిపుణులను రప్పించి ఆ పురాతన కట్టడాన్ని రక్షించే ప్రయత్నం చేయండి. దానిని పునరుద్ధరించే విషయంలో మీకు ఎలాంటి నైపుణ్యం ఉందో లేదో తెలియదు. కానీ మీరు నిజంగానే నైపుణ్యాన్ని వాడుకుంటున్నారా లేదా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది" అని సుప్రీంకోర్టు తెలిపింది
ఎంబీ లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం తాజ్‌మహల్ రంగు ఎందుకు మారుతుందని ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ నాద్‌కర్ణిని ప్రశ్నించింది. అయితే పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత భారత పురాతత్వ శాఖపై ఉందని ఆయన అన్నారు. ఈ క్రమంలో కోర్టు ఈ కేసులో పిటీషను దాఖలు చేసిన ఎంసీ మెహతా చూపించిన తాజ్ మహల్ ఫోటోలను చూసి, ఆ కట్టడం రంగు మారుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆ కేసు విచారణను మే 9వ తేదికి వాయిదా వేసింది