మహారాష్ట్ర: శివసేన, ఎన్సీపీ చెరో రెండున్నరేళ్లు.. కాంగ్రెస్‌కి డిప్యూటీ ?

సుప్రీం కోర్టులో శివ సేన పిటిషన్ సంగతి ఇలా ఉండగానే మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Last Updated : Nov 13, 2019, 11:17 AM IST
మహారాష్ట్ర: శివసేన, ఎన్సీపీ చెరో రెండున్నరేళ్లు.. కాంగ్రెస్‌కి డిప్యూటీ ?

న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి తమకు తగినంత సమయం ఇవ్వలేదని ఫిర్యాదు చేస్తూ శివ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటుకు తాము సిద్ధంగానే ఉన్నప్పటికీ.. తమకు మిత్రపక్షంగా వ్యవహరించనున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్ పార్టీల నుంచి మద్దతు లేఖ తీసుకునేంత సమయం సైతం గవర్నర్ ఇవ్వలేదని, ఈ విషయంలో గవర్నర్ రాజ్యంగవిరుద్ధంగా వ్యవహరించారని శివసేన తమ పిటిషన్‌లో పేర్కొంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే విషయంలో గవర్నర్ వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పార్టీ మౌత్ పీస్‌గా పేరున్న సామ్నా పత్రిక కథనంలోనూ శివసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.

ఇదిలావుంటే, ఈ పిటిషన్ సంగతి ఇలా ఉండగానే మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు అధికారాన్ని పంచుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే, అసెంబ్లీ స్పీకర్ పదవిపైనే వారికి ఇంకా ఓ స్పష్టత రాలేదనే వార్తలొస్తున్నాయి.

Trending News