కర్ణాటక ఎన్నికలు : ప్రధాని నరేంద్ర మోదీకే చురకలంటించిన శత్రుఘ్ను సిన్హా

మనం హద్దులు దాటొద్దు : శత్రుఘ్ను సిన్హా 

Last Updated : May 13, 2018, 12:57 PM IST
కర్ణాటక ఎన్నికలు : ప్రధాని నరేంద్ర మోదీకే చురకలంటించిన శత్రుఘ్ను సిన్హా

తరచుగా పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, పార్టీని, పార్టీ నేతలను ఇరకాటంలో పడేస్తోన్న సొంత పార్టీ ఎంపీ శత్రుఘ్ను సిన్హా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల్ని శత్రుఘ్ను సిన్హా తీవ్రంగా తప్పుపట్టారు. కర్ణాటక ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన ఉపన్యాసాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ మనం హద్దులు దాటకుండా వుండే బాగుంటుంది అని ప్రధానికి సూచించారు. ఎన్నికల ప్రచారం ముగిసిన రోజే ఈ విషయమై ట్విటర్ ద్వారా పలు వ్యాఖ్యలు చేసిన శత్రుఘ్ను సిన్హా... ఏదేమైనా ధన శక్తి ముందు, జన శక్తే గెలుస్తుంది అని ఆ ట్వీట్‌లో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 

 

గతంలో బీహార్, యూపీ, గుజరాత్ ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్‌గా తనని ఆహ్వానించిన పార్టీ కర్ణాటక ప్రచారానికి ఆహ్వానించకపోవడాన్ని సైతం ఈ ట్వీట్స్‌లో ప్రస్తావించారు. తనని పార్టీ ప్రచారానికి ఆహ్వానించనప్పటికీ, ఏ పరిస్థితులలో తనని ఆహ్వానించలేదో అర్థం చేసుకోగలను అంటూనే శత్రుఘ్ను సిన్హా ఈ విషయంపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. 

"పార్టీ శ్రేయోభిలాషిగా, పాత స్నేహితుడిగా ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మనం ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకుండానే సమస్యల గురించి చర్చించొచ్చు. ప్రధాని హోదాకు వున్న గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా వ్యవహరించవచ్చు" అని చేసిన ట్వీట్‌ని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే ట్యాగ్ చేశారు.  

Trending News