ఆడవాళ్ల వేషధారణకు, వారిపై అత్యాచారాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మహిళల వేషధారణే వారిపై పెరుగుతున్న వైంగిక నేరాలు, అత్యాచారాలకు ఓ కారణం అని తరచుగా వినిపిస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ మహిళల వేషధారణే వారిపై లైంగిక వేధింపులకు కారణం అయినట్టయితే, వృద్ధులు, చిన్నారులపై సైతం లైంగిక వేధింపులు ఎందుకు చోటుచేసుకుంటున్నాయని అని అన్నారామె. దేశంలో లైంగిక నేరాలను అదుపులోకి తీసుకురావడంలో దర్యాప్తు బృందాల పాత్ర కొంతమేరకే వుంటుందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారామె.
అత్యధిక శాతం లైంగిక వేధింపుల నేరాల్లో నిందుతులు బాధితులకు తెలిసిన వారు, బంధువులో లేక స్నేహితులో అయి వుంటున్నారని చెప్పారామె. అలాంటి సందర్భాల్లో ఆ కేసులని దర్యాప్తు చేయడంలో దర్యాప్తు బృందాలు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.