న్యూఢిల్లీ: రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రయాణికులు ప్రమాదాలకు గురైతుంటారు. ఇలాంటి ప్రమాదాల్లో కొన్నిసార్లు స్వల్ప గాయాలైతే.. మరొకొన్ని సార్లు ప్రాణాలే పొతుంటాయి. ప్రయాణికుడి నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయంటూ రైల్వే అధికారులు చెబుతుంటారు. కానీ.. ఇక మీదట అలా కుదరదు. రైలు ఎక్కిదిగే క్రమంలో ఎప్పుడైనా మరణించినా లేదా గాయపడినా సదరు ప్రయాణికుడికి పరిహారం పొందే హక్కు కచ్చితంగా ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈమేరకు సుప్రీంకోర్టు బెంచ్ న్యాయమూర్తులు ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారీమన్ తీర్పు ఇచ్చారు.
రైల్వే యాక్ట్ 1989 సెక్షన్ 124-ఎ ప్రకారం ప్రయాణికులు మరణించినా, గాయపడినా బాధితులకు ఎక్స్ గ్రేషియా తప్పనిసరిగా చెల్లించాలని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురయ్యే వ్యక్తి వద్ద రైలు టిక్కెట్ లేనంత మాత్రన పరిహారం పొందడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు కూడా..
దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన లేదా గాయపడిన వారికి పరిహారాన్ని పెంచాలని కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. బాధితుల ఆదాయం, వారి వయసును బట్టి పరిహారాన్ని అందించేలా మోటారు యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ను కేంద్రం ఆదేశించింది. కొత్త నిబంధనల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల నుంచి రూ. 5లక్షల దాకా పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.