ముంబై: మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 145 సభ్యుల మద్దతు ఏ పార్టీకీ లేకపోవడంతో మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటు క్లిష్టంగా మారింది. 105 స్థానాలు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తొలుత ఆహ్వానించినప్పటికీ.. మిత్రపక్షమైన శివసేన విధించిన 50-50 రూలింగ్ షరతుకు బీజేపి సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు కుదరలేదు. ఆ తర్వాత శివసేనకు అదే పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మెజారిటీ విషయంలో ఆ తర్వాతి స్థానంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చేతికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం చిక్కినప్పటికీ.. మళ్లీ మెజారిటీని కూడగట్టుకోవడంలోనే ఆ పార్టీకి కాంగ్రెస్, శివసేనలతో చిక్కులొచ్చిపడ్డాయి. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎన్సీపీకి సైతం క్లిష్టంగానే మారిన నేపథ్యంలో ఒకవేళ సర్కార్ ఏర్పాటులో ఎన్సీపీ కూడా విఫలమైనట్టయితే.. గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందా లేదా అనేది ఇక ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలపైనే ఆధారపడి ఉందంటున్నారు పరిశీలకులు.
అక్టోబర్ 24న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ.. ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి మహారాష్ట్ర రాజకీయాలపైనే ఉంది.