భారతదేశాన్ని మొత్తం నివ్వెరపోయేలా చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీతో పాటు, ఆయన మామయ్య మెహుల్ చోక్సీ విదేశాలకు పారిపోయినట్లు అనేక వార్తలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం మెహుల్ చోక్సీ అమెరికాలోనే ఉన్నట్లు పలుమార్లు తెలిపాయి. అయితే అందరి నమ్మకాలను వమ్ము చేస్తూ ఇటీవలే ఇంటర్ పోల్ ఓ కొత్త వార్తను మోసుకొచ్చింది.
భారతదేశం ఇంటర్ పోల్‌కి లేఖ రాస్తూ చోక్సీ జాడను కనుగొనేందుకు సహకరించాలని కోరగా.. ఆయన అసలు అమెరికాలోనే లేడని ఇటీవలే ఇంటర్ పోల్ స్పందించింది. నీరవ్ మోదీ మాత్రం యూకేలో ఉన్నాడని అధికారిక సమాచారముంది. అయితే అది కూడా ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని ఇప్పుడు అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ కుంభకోణాలు చేసేవారు ఒకే దేశంలో ఉంటారని భావించడం అవివేకమని.. వారు అధికారుల కళ్లు కప్పి వివిధ దేశాలు తిరగడం అనేది సాధారణంగా జరిగే విషయమేనని పలువురు నేర విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం 13 వేల కోట్ల స్కాంతో పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచిన నీరవ్ మోదీ మీద రెడ్ కార్నర్ నోటీసు నమోదైంది. 2011 నుంచీ ఈ స్కాంకు సంబంధించి ప్రణాళికలు జరుగుతున్నా.. అసలు విషయం మాత్రం ఇటీవలే బయటకు వచ్చిందని సమాచారం. ఈ కేసులో నీరవ్ మోదీతో పాటు ఆయన సోదరుడు నిశ్చల్ మోదీ, కంపెనీ ఎగ్జిక్యూటివ్ సుభాష్ ప్రణబ్ పై కూడా కేసులు నమోదు అయ్యాయి.
నీరవ్ మోదీ మామయ్య అమెరికాలో లేడట