న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా వున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సహా పార్టీకి చెందిన ఇతర కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మోదీ పోటీ చేయనున్న లోక్ సభ నియోజకవర్గం గురించి బీజేపీ నేతల వద్ద ఆరాతీయగా.. ఆ విషయంలో ఇప్పటికే పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని వారు పీటీఐకి వెల్లడించినట్టు సమాచారం.
2014 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి 5,81,022 ఓట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే.