Kerala floods : కేరళలో 357 మంది మృతి, నిరాశ్రయులైన 3.53 లక్షల మంది జనాభా

కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే

Last Updated : Aug 19, 2018, 04:28 PM IST
Kerala floods : కేరళలో 357 మంది మృతి, నిరాశ్రయులైన 3.53 లక్షల మంది జనాభా

భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయి, ఆపన్నహస్తుల కోసం వేచిచూస్తున్న కేరళ వరద బాధితుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ రూ.500 కోట్ల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇదివరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్రం నుంచి అందిస్తామన్న రూ.100 కోట్ల ఆర్థిక సహాయానికి అదనంగా కేంద్రం ఈ సహాయాన్ని అందించనున్నట్టు మోదీ తెలిపారు. అంతకన్నా ముందుగా కేరళ రాష్ట్ర గవర్నర్ పి సదాశివం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్‌లతో కలిసి కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ సదాశివం, కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో కేరళలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించిన తర్వాతే వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనావేసి ప్రధాని ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాల‌కు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయాలపాలైన వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు ప్రధాని స్పష్టంచేశారు.

 

 

మే 29 నుంచి ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 357కి చేరిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. 70,000 కుటుంబాలకు చెందిన 3.53 లక్షల మంది నిరాశ్రయులు కాగా వారిని సురక్షితంగా 2,000 తాత్కాలిక శిబిరాలకు చేర్చినట్టు విజయన్ చెప్పారు. కేవలం ఆగస్టు 8 నుంచి ఇప్పటివరకే 194కుపైగా మంది మృత్యువాత పడగా మరో 36 మంది ఆచూకీ గల్లంతైనట్టు కేరళ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్ సిబ్బంది తెలిపారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తనవంతు సహాయంగా రూ.2కోట్లను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి బదిలీ చేయనున్నట్టు తెలిపింది. అంతేకాకుండా కేరళలోని అన్ని భారతీయ స్టేట్ బ్యాంకుల్లో నిర్వహిస్తున్న లావాదేవీలు, తదితర సేవలపై విధించే ఫీజుల నుంచి కొంతకాలం వరకు మినహాయింపు ఇవ్వనున్నట్టు ఎస్బీఐ తాజా ప్రకటనలో పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు కేరళకు కష్టకాలంలో అండగా ఉన్నామని చాటేందుకు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తుండటం అభినందించదగిన విషయం. 

Trending News