ప్యాసింజర్లు తువ్వాళ్ళు, దుప్పట్లు ఎత్తుకెళ్లిపోతున్నారు..

ప్యాసింజర్లు తువ్వాళ్ళు, దుప్పట్లు ఎత్తుకెళ్లిపోతున్నారు..

Last Updated : Oct 6, 2018, 12:56 PM IST
ప్యాసింజర్లు తువ్వాళ్ళు, దుప్పట్లు ఎత్తుకెళ్లిపోతున్నారు..

రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు దుప్పట్లు, తువ్వాళ్ళు ఎత్తుకెళ్తున్నారట. ముంబై కేంద్రంగా పనిచేసే పశ్చిమ రైల్వే శాఖ ఇటీవలే ఈ విషయాన్ని వెల్లడించింది. పశ్చిమ రైల్వే విభాగంలో నడిచే రైళ్లలో ప్రయాణీకులు రూ.2.5కోట్ల విలువైన లినెన్ (నార బట్ట/నేసిన వస్త్రం), ఇతర వస్తువులను దొంగలించినట్లు పశ్చిమ రైల్వే విభాగం తెలిపింది.

సోమవారం ఓ ప్యాసింజర్ రైలులోని ఏసీ కోచ్‌లో బెడ్‌షీట్స్‌, తువ్వాళ్ళను ఎత్తుకెళ్తూ పట్టుబడ్డాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బాంద్రా నుంచి అమృత్సర్‌కు వెళ్లే పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ నుంచి దిండ్లు, ఆరు బెడెషీట్లను రైల్వే శాఖ స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీసు అధికారి వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం రైల్వే స్టేషన్‌లో సోమవారం ప్రయాణీకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

2017-18 ఆర్థిక సంవత్సరంలో 1.95 లక్షల టవాళ్ళు, 81,736 దుప్పట్లు, 55,573 దిండు కవర్లు, 5,038 దిండ్లు, 7043 దుప్పట్లను రైలు ప్రయాణీకులు దొంగలించినట్లు పశ్చిమ రైల్వే గణాంకాలను వెల్లడించింది. వీటి విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని పేర్కొంది.

లినెన్ వస్తువులే కాక.. బాత్రూమ్‌‌లో బిగించిన వస్తువులు కూడా దొంగతనానికి గురయ్యాయని, గత మూడేళ్ల ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు రూ.4వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని పేరు చెప్పడానికి ఇష్టపడని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ముంబై-గోవా మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ రైల్లో టాయిలెట్స్‌లో బ్రాండెడ్ వస్తువులను బిగించినట్లు.. అయితే కొందరు ఆ వస్తువులను దొంగలించి వాటి స్థానంలో చవకైన వస్తువులను బిగించినట్లు ఆ అధికారి తెలిపారు. కొన్నిసార్లు
కోచ్‌లో ఉండే సిబ్బంది దొంగతనానికి గురైన వస్తువులకు వారి జీతం నుండి చెల్లించాల్సి ఉంటుందని, కనుక ఈ విషయంలో కోచ్ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాల్సి వస్తుందని ఆయనన్నారు.

ఇదిలా ఉండగా మరోవైపు ప్రయాణీకులు రైళ్ళలో లినెన్‌ను దొంగిలించారని సెంట్రల్ రైల్వే కూడా పేర్కొంది. 'ఈ ఏడాది మధ్య రైల్వే విభాగంలో నడిచే రైళ్లలో ఏప్రిల్, సెప్టెంబరు మధ్యలో 79,350 చేతి తువ్వాళ్లు, 27,545 బెడ్ షీట్స్, 21,050 దిండు కవర్లు, 2,150 దిండ్లు, 2,065 దుప్పట్లను ప్రయాణీకులు దొంగలించారు. వీటి విలువ రూ. 62 లక్షలు.' అని మధ్య రైల్వే సీనియర్ అధికారి ఇచ్చిన వివరాల ప్రకారం.

ఈ సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పశ్చిమ రైల్వే  ప్రధాన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రవీందర్ భకార్ మాట్లాడుతూ, "ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి మరియు సౌకర్యవంతమైన సేవలను అందించాలని మేము కోరుకుంటున్నాము.  కానీ ఇలాంటి చర్యలు మాకు సవాళ్లుగా ఉన్నాయి." అన్నారు.

Trending News