ఈడి కార్యాలయానికి వెళ్తానని శరద్ పవార్.. వద్దని పోలీస్ కమిషనర్

ఈడి కార్యాలయానికి వెళ్తానన్న శరద్ పవార్.. వద్దని విజ్ఞప్తి చేసిన పోలీస్ కమిషనర్ సంజయ్

Last Updated : Sep 27, 2019, 08:53 PM IST
ఈడి కార్యాలయానికి వెళ్తానని శరద్ పవార్.. వద్దని పోలీస్ కమిషనర్

ముంబై: మనీలాండరింగ్ కేసులో స్వయంగా తానే ఈనెల 27న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరవుతానని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, శరద్ పవార్ విచారణ కోసం ఈడి కార్యాలయానికి వెళ్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ముంబై నగర పోలీస్ కమిషనర్ సంజయ్ బర్వె.. మీరు అక్కడకు వెళ్లకూడదంటూ పవార్ నివాసానికి వెళ్లి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మీరు ఇవాళే ఈడి కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని.. అవసరం ఉన్నప్పుడు తామే పిలుస్తామని పేర్కొంటూ ఈడి అధికారులు సైతం పవార్‌కి ఓ ఈమెయిల్ చేశారు. దీంతో శరద్ పవార్ సైతం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తాను ఇప్పుడే ఈడి విచారణకు హాజరుకాబోనని పవార్ తేల్చిచెప్పారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశానని.. ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఏంటో మహారాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని శరద్‌పవార్‌ వ్యాఖ్యానించారు.

రూ.25,000 కోట్ల విలువైన మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణానికి సంబంధించిన కేసులో శరద్ పవార్‌తో పాటు ఆయన మేనల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మంగళవారం మనీ లాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Trending News