పాట్నా: లోక్ సభ ఎన్నికలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక విడత పోలింగ్‌కి మరో విడత పోలింగ్‌కి మధ్య ఎక్కువ విరామం రాకూడదని, త్వరితగతిన ఎన్నికలు పూర్తి చేయాలని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. నేడు ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పాట్నాలో తన ఓటు హక్కు వినియోగించుకున్న నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రెండు విడతల మధ్య ఎక్కువ విరామం రావడం వల్ల ఓటర్లు అసౌకర్యానికి గురవుతున్నారని, పార్టీలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అన్నారు. ఈ విషయమై ఓ ఏకాభిప్రాయానికి రావాల్సిందిగా కోరుతూ అన్ని పార్టీల అధినేతలకు తాను లేఖలు రాస్తానని నితీష్ కుమార్ తేల్చిచెప్పారు.
మహాత్మా గాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సెని దేశభక్తుడిగా అభివర్ణించిన సాధ్వీ ప్రగ్యాసింగ్ వ్యాఖ్యలపై సైతం నితీష్ కుమార్ స్పందించారు. సాధ్వీ ప్రగ్యాసింగ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన నితీష్ కుమార్.. ఆమెపై బీజేపి ఏం చర్యలు తీసుకుంటుందోననేది వారి అంతగ్రత విషయం కానీ తమ పార్టీ మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊపేక్షించేది లేదని స్పష్టంచేశారు.