భారత ముస్లింలు పాకిస్తాన్ కు వెళ్లిపోవాలి

భారదేశంలో రామ మందిరం నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్న ముస్లింలు పాకిస్తాన్ కు వెళ్ళిపోవాలని  యూపీ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ చెప్పారు.

Last Updated : Feb 3, 2018, 04:45 PM IST
భారత ముస్లింలు పాకిస్తాన్ కు వెళ్లిపోవాలి

అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్న ముస్లింలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు వెళ్ళిపోవాలని లేదా సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్ లో చేరాలని ఉత్తర ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ చెప్పారు.

"అయోధ్యలో రామ జన్మభూమి దేవాలయాన్ని వ్యతిరేకించే వారు, అక్కడ బాబ్రీ మసీదును నిర్మించాలని కోరుకునేవారు, అటువంటి మతవాద మనస్తత్వం కలిగిన ప్రజలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు వెళ్లాలి. అలాంటి ముస్లింలకు భారతదేశంలో స్థానం లేదు" అని రిజ్వీ చెప్పారు. "మసీదుల పేరిట జిహాద్ ను వ్యాప్తి చేయాలనుకునేవారు సిరియాలోని ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ బగ్దాది దళాల్లో చేరాలి" అని రిజ్వీ చెప్పారు. షియా వక్ఫ్ బోర్డు చీఫ్ అయోధ్యలో వివాదాస్పద ప్రదేశంలో శుక్రవారం ప్రార్ధనల్లో పాల్గొని రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ని కలిశారు.

రిజ్వి వ్యాఖ్యలపై మండిపడ్డ షియా మత పెద్దలు.. ఆయన శాంతంగా ఉన్న వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నారని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రిజ్వి వక్ఫ్ ఆస్తులను దొంగలిస్తున్నాడని.. చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నాడని షియా ఉలేమా కౌన్సిల్ అధ్యక్షుడు మౌలానా ఇఫ్తెక్హర్ హుస్సేన్ ఇక్విలాబీ ఆరోపించారు. "యూపీలో సమాజ్వాది పార్టీ పాలనలో ఆయన ములాయం సింగ్ యాదవ్, అప్పటి మంత్రి అజమ్ ఖాన్లచే పోషించబడ్డారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సమయంలో అతను విడిపోవాలని కోరుకుంటున్నాడు" ఇంక్విలాబీ చెప్పారు.

అయితే రిజ్వీ వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం మొదటిసారి కాదు. అంతకు ముందు ఆయన మదర్సాలలో చదివే పిల్లలను తీవ్రవాదులుగా మార్చారని చెప్పి పెద్ద దుమారమే లేపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అన్ని మదర్సాలను నిషేధించాలని, వాటిపై విచారణ చేయాలని ఆయన కోరారు.

Trending News