Mumbai Red Alert: దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. 30 సెంటీమీటర్లు దాటిన వర్షపాతంతో నగరం చెరువులా మారిపోయింది. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ మొత్తం స్థంబించింది. రానున్న 24 గంటలు అత్యంత విషమంగా ఉండవచ్చనే హెచ్చరికలు భయపెడుతున్నాయి.
24 గంటలు అత్యంత కీలకం
ముంబై మహా నగరం భారీ వర్షాలతో అల్లాడిపోయింది. రానున్న 24-36 గంటలు అత్యంత విషమ పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు నగర ప్రజల్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. రానున్న 24 గంటల్లో ముంబైలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 24 గంటలు రెడ్ అలర్ట్ జారీ అయింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి షిండే సైతం ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆదివారం అర్ధరాత్రి నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరం మొత్తం చెరువులా మారిపోయింది. కేవలం ఆరేడు గంటల్లో దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లు జలమయమయ్యాయి. బస్డాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో నీరు నిలిచిపోయింది. రవాణా వ్యవస్థ మొత్తం స్థంబించిపోయింది.ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి 100-120 మిల్లీమీటర్లు, మరి కొన్నిప్రాంతాల్లో 80-100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రతికూల వాతావరణం కారణంగా ముంబై విమానాశ్రయంలో 50 విమానాలు రద్దయ్యాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగాల్సిన 14 విమానాలను హైదరాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. ఈ 14 విమానాల్లో 10 అంతర్జాతీయ విమానాలున్నాయి. దోహా నుంచి 3, యూఏఈ నుంచి 2, దుబాయ్ నుంచి 1, అబుబాది నుంచి ఒక విమానం ఉన్నాయి. మరో ఐదు విమానాలు మస్కట్, కొలంబో, ఫుకెట్, అడిస్ అబాబా, అజర్ బైజాన్ నుంచి వచ్చిన విమానాలున్నాయి. డొమెస్టిక్ విమానాలు కూడా నాలుగు హైదరాబాద్‌కు మళ్లించారు. మరో 13 విమానాలను అహ్మదాబాద్, ఇండోర్ విమానాశ్రయాలకు మళ్లించారు.
ముంబై నగరంలో వర్షపు నీటిని తోడేందుకు మున్సిపల్ యంత్రాంగం నిత్యం శ్రమిస్తోంది. మొత్తం 661 మోటార్ పంపులతో ఎక్కడికక్కడ నీళ్లను తోడే పనులు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ముంబైలో స్కూళ్లు, కళాశాలలకు ఇప్పటికే సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రెడ్ అలర్ట్ జారీ కావడంతో జనం భయందోళనలో బిక్కుబిక్కుమంటూ ఉంది.
Also read: Terror Attack: కధువాలో ఉగ్రదాడి, ఐదుగురు జవాన్ల వీరమరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook