పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి రూ.11, 400 కోట్లు ఎగనామం పెట్టిన నిరవ్ మోడీతోపాటు అతడి అంకుల్ మెహుల్ చోక్సీ ఇద్దరూ తమ సంస్థల్లోని ఉద్యోగులు కొత్త ఉద్యోగాలు చూసుకోవాల్సిందిగా స్పష్టంచేశారు. జీ బిజినెస్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం మెహుల్ చోక్సీ నిర్వహిస్తోన్న గీతాంజలి జెమ్స్ సంస్థ ఇప్పటికే 5000 మంది సిబ్బందికి పింక్ స్లిప్స్ జారీచేసినట్టు తెలుస్తోంది. నిరవ్ మోడీ సైతం తన సంస్థలో పనిచేస్తోన్న సిబ్బందికి ఇదే హెచ్చరికలు జారీచేస్తూ.. కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందిగా లేఖ రాసినట్టు సమాచారం. సంస్థ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారినందున సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగాల వేటలో పడటం మేలు అని నిరవ్ మోడీ తన లేఖలో పేర్కొన్నట్టు జీ బిజినెస్ కథనం స్పష్టంచేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత నిరవ్ మోడీ, మెహుల్ చోక్సీలపై పలు దర్యాప్తు సంస్థలు దృష్టిసారించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వరుసగా ఏడవ రోజైన బుధవారం నిరవ్ మోడీతో సంబంధం కలిగి వున్న కంపెనీలలో దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 17 ప్రాంతాలలో బుధవారం ఈడీ తనిఖీలు నిర్వహించింది.
కొత్త ఉద్యోగాలు చూసుకోండి : నీరవ్ మోడీ