అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కోరుతూ భారీ సంఖ్యలో ఆర్ఎస్ఎస్, శివసేన కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ తాము ఆదివారం నాడు హంకర్ ర్యాలీ నిర్వహించి తమ సత్తా ఏమిటో చూపిస్తామని తెలిపింది. మరో వైపు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే శనివారం అయోధ్యను సందర్శించనున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం వరకూ అయోధ్య పరిసర ప్రాంతాల్లో భారీగా ఉద్యమకారులు, కార్యకర్తలు తిరిగే అవకాశం ఉంది కాబట్టి.. ఈ వీకెండ్‌ను "సూపర్ సండే" అని పిలుస్తున్నారు.
అలాగే నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేస్తున్నారు. ముఖ్యంగా అయోధ్యలో 144 సెక్షన్ విధించి.. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు మందస్తు ప్రణాళికలు వేస్తున్నారు. కడపటి సమాచారం అందేసరికి.. ఉద్ధవ్ థాక్రే అయోధ్య సందర్శనకు బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇంటి నుండి బయలుదేరిన ఆయన ఈ రోజు సాయంత్రం తన ఛార్టెడ్ విమానం ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్య వస్తున్నారు.
అయోధ్యకు రాగానే థాక్రే శ్రీ విద్వాంత్ సంత్ పుజన్ ఆశ్రమాన్ని సందర్శించి.. అక్కడి సాధువులకు రామ మందిర నిర్మాణం కోసం వెండి ఇటుకలు దానం చేయనున్నారు. అలాగే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సరయు నదితీరంలో జరిగే మహా ఆరతిలో కూడా పాల్గొననున్నారు.
ఇప్పటికే దాదాపు 25000 మంది శివ సైనికులు పెద్దఎత్తున ఈ రోజు అయోధ్యకు చేరుకున్నారు. కాగా.. ‘బాబ్రీమసీదును కూల్చేందుకు రామభక్తులకు 17 నిమిషాలు మాత్రమే పట్టిందని, కానీ రామమందిర నిర్మాణం కోసం చట్టం చేసేందుకు భారత ప్రభుత్వానికి ఎంత సేపు పడుతుంది?’’ అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌రౌత్ ప్రశ్నించారు. ఈ విషయంపై తాడో పేడో తేల్చుకోవడానికే తాము అయోధ్యకు వస్తున్నామని ఆయన అన్నారు.