కేరళకు ముంచుకొస్తున్న మరో గండం.. వాతావరణ శాఖ వార్నింగ్ !

కేరళకు ముంచుకొస్తున్న మరో గండం

Last Updated : Oct 3, 2018, 07:28 PM IST
కేరళకు ముంచుకొస్తున్న మరో గండం.. వాతావరణ శాఖ వార్నింగ్ !

ఇటీవల కురిసిన వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆ విపత్తు మిగిల్చిన విషాదం నుంచి తేరుకోకముందే మరో గండం వెంటాడుతోంది. అరేబియా మహా సముద్రంలో శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్ప పీడనం బలపడి తుపాన్ గా మారే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం కేరళను హెచ్చరించింది. లక్షద్వీప్ తీరానికి అనుకుని ఈ తుపాన్ ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక పేర్కొంది. కేంద్రం నుంచి అందిన హెచ్చరికల మేరకు, అక్టోబర్ 5 లోగా మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా హెచ్చరించినట్టు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తెలిపారు. అక్టోబర్ 7న తుపాన్ ప్రభావం అధికంగా ఉండనున్న 3 జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు పినరై విజయన్ చెప్పారు.

కేరళకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో డిజాష్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది. కేంద్రం నుంచి సహాయం కోరినట్టు తెలిపిన పినరై విజయన్.. అక్కడి నుంచి కేరళకు 5 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు రాష్ట్రానికి వస్తున్నట్టు స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులు సైతం కొండ ప్రాంతాలకు వెళ్లొద్దని కేరళ సర్కార్ హెచ్చరించింది. ముఖ్యంగా నీలకురింజిని వీక్షించేందుకు మున్నార్ వెళ్లే పర్యాటకులు తమ పర్యటనను ఉపసంహరించుకోవాల్సిందిగా కేరళ సర్కార్ విజ్ఞప్తి చేసింది. 

Trending News