బెంగళూరు సమీపంలో బస్సు హైజాక్; నిందితులు అరెస్టు..!

కర్ణాటకలో పోలీసులు శాసన సభ ఎన్నికల ఎన్నికల పనిలో కంటిమీద కునుకు లేకుండా తనిఖీలు నిర్వహిస్తుంటే.. ఇదే మంచి సమయం అనుకొని నిందితులు ఓ బస్సును హైజాక్ చేశారు.

Last Updated : Apr 28, 2018, 05:43 PM IST
బెంగళూరు సమీపంలో బస్సు హైజాక్; నిందితులు అరెస్టు..!

బెంగళూరు: కర్ణాటకలో పోలీసులు శాసనసభ ఎన్నికల పనిలో కంటిమీద కునుకులేకుండా తనిఖీలు నిర్వహిస్తుంటే.. ఇదే మంచి సమయం అనుకొని నిందితులు ఓ బస్సును హైజాక్ చేశారు. పోలీసుల వేషాన్ని ధరించి నిందితులు బెంగళూరు నుంచి కేరళ వెళ్తున్న 42 మంది ప్రయాణికులున్న ఓ ప్రైవేటు బస్సును హైజాక్ చేశారు. పూర్తి సినీ ఫక్కీలో జరిగిన ఈ హైజాక్ బెంగళూరులో కలకలం రేపింది.

శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి కేరళలోని కన్నూర్‌కు చెందిన లామా ట్రావెల్స్ బస్సు 42 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మైసూరు రోడ్డులోని ఆర్వీ కాలేజ్ సమీపంలో నలుగురు వ్యక్తులు మోటార్ బైకుల్లో సినిమా తరహాలో బస్సును అడ్డగించారు. 'మేము పోలీసులం. ఇది ఎన్నికల సమయం. బస్సును సోదాలు చేయాలి' అని ప్రయాణీకులను బెదిరించి బస్సు డ్రైవర్‌పై దాడి చేసి .. బస్సును నేరుగా రాజరాజేశ్వరి నగరలోని పట్టణగెరె ప్రాంతంలోని గోదాములోకి తీసుకెళ్లారు.

బస్సులో ఉన్న ప్రయాణీకులు బయటకి వెళ్ళకుండా గోదాముకు లాక్ చేశారు. ప్రయాణికుల్లో ఒకరు హైజాకర్లకు అనుమానం రాకుండా పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి, ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. నలుగురు హైజాకర్లను అదుపులోకి తీసుకొని ఐపీసీ సెక్షన్ ప్రకారం 341, 342 సెక్షన్ల  కింద కేసు నమోదు చేశారు. అయితే దాడి చేసే సమయంలో ముగ్గురు నిందితులు తప్పించుకున్నారని, వారిని గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. బస్సు యజమానికి పైనాన్స్ కంపెనీ రుణం ఇచ్చిందని.. రుణం సక్రమంగా చెల్లించనందుకు బస్సును హైజాక్ చేశారని పోలీసులు చెప్పారు.

Trending News