రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న గవర్నర్ వ్యవస్థపై చాలాకాలంగా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో వివాదం తలెత్తిన ప్రతిసారీ ఈ వివాదం తెరపైకి వస్తోంది. బహుశా అందుకే కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోగా..తెలంగాణ అదే బాటలో పయనిస్తుందనే వార్తలు విన్పిస్తున్నాయి.
కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం రాజుకుంటోంది. కేరళలో చాలాకాలంగా పినరయి విజయన్ ప్రభుత్వానికి గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటు తెలంగాణలో గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వివాదం అధికమౌతోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది.
రాష్ట్రంలోని యూనివర్శిటీలకు ఛాన్సలర్‌గా గవర్నర్ వ్యవహరించే బాధ్యతల్ని తొలగించే బిల్లును అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. బిల్లు ఆమోదం పొందినట్టుగా స్పీకర్ ఏఎన్ శాంసీర్ ప్రకటించారు. యూనివర్శిటీలకు ఛాన్సలర్‌గా వ్యవహరించిన గవర్నర్ స్థానంలో విద్యారంగ నిపుణుల్ని నియమించనున్నట్టు బిల్లులో స్పష్టం చేసింది ప్రభుత్వం.
ఈ బిల్లుపై కేరళ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య వాదన సాగింది. విశేషమేమంటే ప్రతిపక్షం ఈ బిల్లుకు చాలావరకూ అనుకూలంగానే ఉంది. కొన్ని సవరణలు మాత్రం చేసింది. గవర్నర్‌కు బదులు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లేదా కేరళ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఉంటే బాగుంటుందని అక్కడి విపక్షం సూచించింది. మరోవైపు ఛాన్సలర్ల ఎంపిక కమిటీలో ప్రతిపక్షనేత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలన్న ప్రతిపక్ష సూచనను ప్రభుత్వం నిరాకరించింది. మొత్తానికి విపక్షాల బాయ్‌కాట్‌తో బిల్లు ఆమోదం పొందింది.
ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య వివాదం తెలంగాణలో కూడా ఉంది. గత కొద్దికాలంగా ఈ వివాదం పెరిగి పెద్దదవుతోంది. విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం పంపించిన కొన్ని బిల్లుల్ని గవర్నర్ పెండింగులో ఉంచడంతో పరిస్థితి మరింత విషమిస్తోంది. ఈ క్రమంలో గవర్నర్ పదవులకు కోత విధించే నిర్ణయాలు తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. కేరళ బాటలోనే యూనివర్శిటీ ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తప్పించవచ్చని తెలుస్తోంది.
Also read: Amit Shah: మోదీ ఉన్నంత కాలం ఒక్క అంగుళం భూమి కూడా పోనివ్వం: హోంమంత్రి అమిత్ షా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook