కాలా నిర్మాతకు కుమారస్వామి ఇండైరెక్ట్ వార్నింగ్ ?

కర్ణాటకలో కాలా విడుదల వివాదంపై స్పందించిన కుమారస్వామి 

Last Updated : Jun 5, 2018, 10:27 PM IST
కాలా నిర్మాతకు కుమారస్వామి ఇండైరెక్ట్ వార్నింగ్ ?

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కాలా సినిమా మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ముందుకు రానుంది. అయితే, తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నది జలాల పంపకం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో కాలా సినిమాను నిషేధించాల్సిందిగా పలు కన్నడ ప్రజా సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ వివాదం కాస్తా హై కోర్టు మెట్లెక్కింది. కాలా నిర్మాతల వాదన విన్న కర్ణాటక హై కోర్టు.. సినిమాను కర్ణాటకలో విడుదల చేయడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటక హై కోర్టు ఉత్తర్వులపై తాజాగా ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. ప్రస్తుతం కావేరి వివాదం పరిష్కారం కానందున, కాలా సినిమాను ఇప్పుడప్పుడే కన్నడనాట విడుదల చేయడం ఆ చిత్ర నిర్మాతలకు అంత శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు. 

ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో కాలా సినిమాను కన్నడ నాట విడుదల చేస్తే, నిర్మాతలు ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పాటిస్తుంది. కాకపోతే కావేరీ జలాల వివాదం సద్దుమణిగిన తర్వాత సినిమాను విడుదల చేస్తే అందరికీ శ్రేయస్కరం. కన్నడ ఫిల్మ్‌ చాంబర్‌, కన్నడ ఆర్గనైజేషన్లు సైతం ‘కాలా’ విడుదలను వ్యతిరేకిస్తున్నాయి. తాను ఓ ముఖ్యమంత్రిగా కాకుండా, సగటు పౌరుడిగా, ఓ కన్నడ వ్యక్తిగా తన అభిప్రాయాన్ని వెల్లడించానని కుమారస్వామి స్పష్టంచేశారు.

Trending News