ఒకవేళ రైల్వే బోర్డు సిఫార్సు చేసిన కొత్త నిబంధన అమలులోకి వస్తే అక్టోబరు 2 (గాంధీ జయంతి) నాడు రైలు ప్రయాణికులకు మాంసాహారం తినే యోగం లేనట్లే లెక్క. జాతిపిత మహాత్మగాంధీ ప్రతిపాదించిన అహింసా సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు.. అలాగే 2019 సంవత్సరంలో జరిగే మహాత్మగాంధీ 150వ జయంతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నిబంధనను అమలులోకి తీసుకురావాలని రైల్వే బోర్డు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అలాగే ఆ సంవత్సరం ప్రతీ రైలు టిక్కెటు పై కూడా గాంధీ బొమ్మను ముద్రించాలని కూడా బోర్డు భావిస్తోంది.
ముఖ్యంగా రైల్వేస్టేషన్లలో ప్రతీ సంవత్సరం అక్టోబరు 2వ తేదిన "వెజిటేరియన్ డే" జరుపుకొనేలా ఆంక్షలు తీసుకొస్తామని బోర్డు తెలిపింది. అలాగే భారతదేశంలోని ప్రతీ రైల్వే స్టేషనులో మహాత్మగాంధీ జీవిత విశేషాలతో కూడిన డిజిటల్ మ్యూజియం నెలకొల్పాలని కూడా బోర్డు ప్రతిపాదించింది.
గతనెల మహాత్మగాంధీ 150వ జయంతోత్సవాలకు సంబంధించి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు రూపకల్పన చేసేందుకు వివిధ శాఖల అధికారులతో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందులో రైల్వే శాఖ ప్రతిపాదించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలను సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖలతో కలిసి రైల్వేశాఖ చేయాల్సి ఉంది. అందులో లోగో డిజైన్ లాంటి అంశాలు కూడా ఉన్నాయి.