Income Tax Department Freezes V. K. Sasikala’s Assets: చెన్నై: తమిళనాడు (Tamil nadu) దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ (V. K. Sasikala) కు ఐటీ శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. ఓ వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు మూడు నెలల్లో శశికళ జైలు నుంచి విడుదల కానున్న తరుణంలో ఆమెతోపాటు ఆమె బంధువులకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) జప్తు చేసింది. తమిళనాడులోని సిరుత్తవూరు, కొడనాడులో ఉన్న శశికళ, ఆమె బంధువులైన ఇళవరసి, సుధాకరన్‌కు చెందిన రెండువేల కోట్ల ఆస్తులను బినామీ నిషేధిత చట్టం ప్రకారం స్తంభింపజేసినట్లు ఐటీ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు నోటీసులు సైతం అంటించారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే నాయకురాలు శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్ కూడా జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. Also read: శశికళ ఆస్తులపై 187 చోట్ల రైడ్..!
ఇదిలాఉంటే.. జయలలిత మరణం తరువాత.. 2017లో శశికళ, ఆమె బంధువులకు చెందిన నివాసగృహాలు, కార్యాలయాలు తదితర చోట్ల ఒకే సమయంలో 187 చోట్ల ఆదాయపు పన్నుల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. ఆ తనిఖీల్లో శశికళ, బంధవులు బినామీ సంస్థలు నడిపి రూ.1500కోట్ల మేరకు పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అధికారులు సమగ్రంగా దర్యాప్తు జరిపి గతేడాది నవంబర్‌లో రూ.1600 కోట్ల విలువైన బినామీ ఆస్తులను జప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శశికళ, ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌కు చెందిన మరో రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రకటించారు. Also read: Tamil nadu: అన్నాడీఎంకే సీఎం అభ్యర్ధిగా మరోసారి పళనిస్వామికి అవకాశం