కేరళలో హైఅలర్ట్: రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలో హైఅలర్ట్: రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Last Updated : Oct 17, 2018, 05:43 PM IST
కేరళలో హైఅలర్ట్: రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

ఒకవైపు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ రాష్ట్రం అట్టుడుకుతుంటే.. మరోవైపు నెలవారీ పూజల నిమిత్తం బుధవారం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుతో పలువురు మహిళలు ఆలయంలోకి ప్రవేశిచడానికి సిద్ధమయ్యారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తున్న వారు ఆలయంలోకి మహిళలు ప్రవేశించాలని ప్రయత్నిస్తే భౌతిక దాడులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోవైపు శబరిమలకు మహిళలు వస్తే ఆత్మహత్య చేసుకుంటామని శివసేన కార్యకర్తలు బెదిరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేరళలో ఉద్రిక్తత నెలకొంది.

అటు కేరళ విజయన్ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేది లేదని మరోసారి తేల్చి చెప్పింది. శాంతిభద్రతలను ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే ఊరుకొనే ప్రసక్తే లేదని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్పష్టం చేశారు. శబరిమల ఆలయానికి వెళ్లే భక్తులకు తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. 'ప్రభుత్వం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయదు. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని కోర్టుకు చెప్పాం.' అని పి.విజయన్ అన్నారు. ఆలయానికి వచ్చేవారందరికీ తగిన భద్రత కల్పిస్తామని మంత్రి జయరాజన్ ప్రకటించారు.

మరోవైపు కేరళలో ఆందోళనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. జిల్లాల వారీగా ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నాయి. పార్టీలు, వర్గాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో మహిళలు నిరసన ప్రదర్శనలు చేపట్టుతున్నారు. శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటామంటూ అయ్యప్ప భక్తులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీలతో పాటు హిందూ సంఘాలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నాయి.

అటు ఇవాళ కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో రేపు తెరుచుకోనున్న కేరళ శబరిమల ఆలయంపై చర్చించడానికి ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది.

కాగా నెలవారీ కార్యక్రమాల నిమిత్తం రేపు తెరుచుకోబోతున్న శబరిమల ఆలయం ఈనెల 22న తిరిగి మూతపడుతుంది.

 

 

 

Trending News