బిల్లు చెల్లించలేదని.. రోగిని ఆసుపత్రిలోనే..

బిల్లు చెల్లించలేదని.. రోగిని ఆసుపత్రిలోనే..

Last Updated : Aug 25, 2019, 11:40 PM IST
బిల్లు చెల్లించలేదని.. రోగిని ఆసుపత్రిలోనే..

న్యూఢిల్లీ: శస్త్ర చికిత్సకు అయిన బిల్లుని చెల్లించలేదనే ఆగ్రహంతో ఓ ఆసుపత్రి నిర్వాహకులు రోగిని డిశ్చార్జ్ చేయకుండా ఐదు రోజులపాటు బంధీగా ఉంచిన వైనం ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. అంతేకాదు.. ఆ ఐదు రోజుల పాటు రోజుకు రూ.1,000 చొప్పున రోగికి అయిన వైద్య ఖర్చులను కూడా చెల్లించిన తర్వాతే అతడిని తీసుకెళ్లాల్సిందిగా షరతు విధించింది. ఢిల్లీలో ఓ ప్రైవేటు సంస్థలో సెక్యురిటీగా పనిచేస్తోన్న 48 ఏళ్ల మొహమ్మద్ ఉమర్ బ్లాడర్‌లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఢిల్లీలోనే పేరున్న ఓ ఆసుపత్రిలో చేరాడు. మొహమ్మద్ ఉమర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆసుపత్రిలో చేరిన ఉమర్‌కి శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించగా.. అంత ఖర్చు తాను భరించలేనని ఉమర్ ముందుగానే తేల్చిచెప్పేశాడు. అయితే, అతడికి ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి శస్త్రచికిత్సకు అయ్యే మొత్తం బిల్లును ఆమోదం పొందేలా చేయించుకునే పూచి తమదేనని నమ్మబలికిన ఆసుపత్రి యాజమాన్యం అతడికి ఆగస్టు 11నే శస్త్రచికిత్స పూర్తి చేసింది. శస్త్రచికిత్స పూర్తయిన మరుసటి రోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాల్సి ఉండగా అతడు ఆపరేషన్‌కి అయిన మొత్తాన్ని చెల్లిస్తేనే డిశ్చార్జ్.. అప్పటివరకు ఆస్పత్రిలోనే బందీగా ఉండాలంటూ మెలిక పెట్టారు. అదేమని ప్రశ్నిస్తే, ఇన్సూరెన్స్ బిల్లు రాలేదంటున్నారని మొహమ్మద్ ఉమర్ వాపోయాడు. 

ఇదే విషయమై ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీయగా... అటువంటిదేమీ లేదని, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లే శస్త్రచికిత్స విషయమై రోగిని కలుస్తామని చెప్పినందువల్లే ఉమర్‌ని ఆసుపత్రిలో ఉంచుకోవాల్సి వచ్చిందని అన్నారు. అయితే, ఉమర్ కుమారుడు ఇమ్రాన్ మాత్రం ఆసుపత్రి యాజమాన్యం చెబుతున్నదంతా అవాస్తవం అని కొట్టిపారేస్తున్నాడు. ఆపరేషన్‌కి ఒక రోజు ముందే ఆగస్టు 10న ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు వచ్చి ధృవీకరించుకుని వెళ్లారని.. తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడీ కొత్త నాటకానికి తెర తీస్తున్నారని ఉమర్ తనయుడు ఇమ్రాన్ మీడియాకు తెలిపారు. 

రోగి బిల్లు చెల్లించలేదనే కారణంతో రోగిని బలవంతంగా ఆసుపత్రిలోనే ఉంచుకోవడం చట్టరీత్యా నేరం అవుతుందని 2017లోనే ఢిల్లీ హైకోర్టు ఓ కేసు తీర్పులో పేర్కొనడం గమనార్హం.

Trending News