అలర్ట్: నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు

అలర్ట్: నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు

Last Updated : Nov 8, 2018, 06:45 PM IST
అలర్ట్: నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు

దీపావళితో పండగ కళను తీసుకొచ్చిన నవంబర్ నెలలో ఆ తర్వాత కూడా పలు పర్వదినాలు క్యూ కడుతుండటంతో బ్యాంకులకు సెలవులు సైతం క్యూ కట్టనున్నాయి. ఫలితంగా బ్యాంకులలో నగదు జమ, నగదు ఉపసంహరణ, రుణాలకు దరఖాస్తుల సమర్పణ వంటి ఎన్నో లావాదేవీల విషయంలో వినియోగదారులకు కొంత అసౌకర్యం ఏర్పడక తప్పదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏయే రోజు బ్యాంకులకు సెలువులు వర్తించనున్నాయనే విషయాన్ని ముందే తెలుసుకుంటే, ఆ తర్వాత సెలవు రోజున బ్యాంకుల వరకు వెళ్లి మళ్లీ ఉసూరుమంటూ వెనక్కి తిరిగి రావాల్సిన దుస్థితి తప్పుతుంది. 

అయితే, ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, అన్ని రాష్ట్రాల్లో సెలవు దినాలు ఒకే విధంగా కాకుండా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంప్రదాయాలు, పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఏయే రాష్ట్రాల్లో ఏయే రోజున సెలవు దినాలు ఉన్నాయో ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం.

November 01 
నవంబర్ 1:
పుదుచ్చేరి, హర్యానా, కర్ణాటక, మణిపూర్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు వర్తించనున్నాయి.

నవంబర్ 06:
నవంబర్ 5న ధన్‌తెరాస్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులు ప్రకటించాయి.

నవంబర్ 07:
దీపావళి పర్వదినం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ రోజున బ్యాంకులు సెలవు ప్రకటించాయి. 

నవంబర్ 08:
దీపావళి పర్వదినం తర్వాత వస్తున్న రోజు కావడంతో చాలా వరకు బ్యాంకులు నవంబర్ 08న సైతం తమ సిబ్బందికి సెలవు ప్రకటించాయి. 

నవంబర్ 09:
ఉత్తరాది రాష్ట్రాల్లో జరుపుకునే భాయ్ బిజ్ పర్వదినాన్ని పురస్కరించుకుని మేఘాలయ, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అనేక బ్యాంకులు సెలవులు ప్రకటించాయి. 

నవంబర్ 10, 11 :
నవంబర్ 10, 11 తేదీల్లో ఎటువంటి పండగలు లేనప్పటికీ, బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రతీ 2వ శనివారం సెలవు దినం కావడంతో నవంబర్ 10న 2వ శనివారం సెలవు, ఆ తర్వాతి రోజున ఆదివారం కావడంతో మరో సెలవు ఉండనున్నాయి.

నవంబర్ 14:
నవంబర్ 14న ఛాత్ పూజ కారణంగా బీహార్, అస్సాం, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు పాటించనున్నాయి.

నవంబర్ 21:
ప్రొఫెట్ మొహమ్మద్ జయంతిని ఈద్-ఇ-మిలాద్ పేరిట ముస్లిం సోదరులు పవిత్ర దినంగా భావిస్తారు. ఈ కారణంగా నవంబర్ 21న మహారాష్ట్ర, కేరళ, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు దినంగా పాటించనున్నాయి.

నవంబర్ 23:
గురునానక్ జయంతిని పురస్కరించుకుని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, డయ్యూ డామన్, గోవా, కేరళ, కర్ణాటక, మణిపూర్, మేఘాలయ, ఒడిషా, పుదుచ్చెరి, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాలతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు నవంబర్ 23ను సెలవు దినంగా పరిగణిస్తున్నాయి.

నవంబర్ 24:

పంజాబ్‌లో నవంబర్ 24న బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. 

నవంబర్ 26: 

కర్ణాటకలో బ్యాంకులకు నవంబర్ 26 సెలవు. 

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రోజు సెలవు దినాలు పాటిస్తున్న కారణంగా పలు సందర్భాల్లో ఇతర రాష్ట్రాల్లోని బ్రాంచులతో లావాదేవీలు జరిపే క్రమంలో అక్కడి బ్యాంకులకు సెలవు ఉన్నట్టయితే, ఆ లావాదేవీలు పూర్తవడం కోసం మరుసటి రోజు వరకు వేచిచూడక తప్పని పరిస్థితులు ఎదురవుతుంటాయని బ్యాంకింగ్ రంగానికి చెందిన నిపుణులు సూచిస్తున్నారు.

Trending News