ప్రభుత్వ ఉద్యోగులు గంట ఆలస్యంగా వస్తే.. హాఫ్ డే లీవ్ తీసుకోవాల్సిందే..!

ఢిల్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు.. ఆ రాష్ట్ర సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. 

Last Updated : Aug 5, 2018, 07:30 PM IST
ప్రభుత్వ ఉద్యోగులు గంట ఆలస్యంగా వస్తే.. హాఫ్ డే లీవ్ తీసుకోవాల్సిందే..!

ఢిల్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు.. ఆ రాష్ట్ర సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ రోజు ఉదయం గంటసేపు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవ్వాలని ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ సమావేశాలకు పలువురు ఉద్యోగులు ఆలస్యంగా వస్తుండడంతో ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఉదయం పది గంటలకు ముందే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉద్యోగులు సమావేశానికి హాజరవ్వాలని.. లేని పక్షంలో వారికి సగం రోజు లీవ్‌ను గ్రాంట్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

ఒకవేళ ఉద్యోగి ఎవరైనా వేరే పని నిమిత్తం అత్యవసరమై వెళ్తే.. వారికి సెలవు నుండి మినహాయింపు ఇస్తామని.. కానీ ఆ ఉద్యోగి స్థానంలో మరో ఉద్యోగి ఆ సమావేశానికి హాజరయ్యేలా అధికారులు చూడాలని ప్రభుత్వం తెలపింది. సమావేశాలకు గైర్హాజరవుతున్న అధికారుల విషయంలో కఠినంగా ఉంటేనే పరిపాలన అనుకున్న విధంగా సాగుతుందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపింది.

గతంలో జనతా దర్బార్ పేరుతో ఇలాంటి సమావేశాలనే నిర్వహించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు లేఖ రాశారు. వివిధ శాఖలు తీసుకొనే నిర్ణయాలలో గవర్నర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నందున.. ఆయన కూడా ముందస్తు అనుమతులను పక్కన పెట్టి ప్రజలను కలుసుకొని సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని అరవింద్ కేజ్రీవాల్ తన లేఖలో తెలియజేశారు. 

Trending News