భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!

రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండికి డిమాండ్ అమాంతం పెరిగింది. 

Last Updated : Jan 29, 2019, 12:03 AM IST
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!

న్యూఢిల్లీ: రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండికి డిమాండ్ అమాంతం పెరిగింది. దేశీయంగా జువెలర్స్, బంగారం వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం, వెండి ధరలకు సైతం ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.33,650 కి చేరింది. ఇక సిల్వర్ విషయానికొస్తే, సోమవారంనాడు కిలో వెండి ధర రూ. 850 పెరిగి రూ.40,900 మార్క్‌ను తాకింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికం కావడంతో వెండి ధరలు సైతం కొండెక్కాయి. 

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 350 పెరిగి రూ.33,650 పలకగా 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.350 పెరిగి మొత్తం రూ. 33,500 పలికింది.

పెళ్లిళ్ల సీజన్ కావడంవల్లే బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడిందని బులియన్ మార్కెట్ వర్గాలు సైతం పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయంగా ఒక ఔన్స్ బంగారం ధర 1,301.82 అమెరికన్ డాలర్లకు చేరుకోగా న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 15.77 అమెరికన్ డాలర్లకు ఎగబాకింది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగడానికి ఇది కూడా ఓ కారణమైందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Trending News