కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్, కాంగ్రెస్ వర్గాల్లో చీలికలు మొదలయ్యాయని.. చాలామంది బీజేపీకి తరలిరావాలని భావిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు. వెంటనే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి మాట్లాడమని.. వారు బీజేపీకీ మద్దతు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని ఆయన తెలిపారు.
జులై 5వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏదైతే ఉందో.. అది మైనారిటీ బడ్జెట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో కర్ణాటకలో కేవలం బీజేపీ నాయకత్వం మాత్రమే ఉంటుందని.. అంత బలంగా పార్టీ తయారవుతుందని యడ్యూరప్ప తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రెండూ కూడా మనస్ఫూర్తిగా పనిచేయడానికి ప్రయత్నించడం లేదని.. వారి వైఖరి రాష్ట్రానికి హానికరంగా తయారవుతుందని యడ్యూరప్ప తెలిపారు.
ఇటీవలే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కేవలం ఒక్క రోజు మాత్రమే కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన యడ్యూరప్ప ఆనందం ఆ ఒక్కరోజులోనే ఆవిరయిపోయి ఆశలను అడియాసలు చేసింది. గవర్నర్ సూచనతో సీఎం సీటు కైవసం చేసుకోవాలని భావించిన ఆయన ఆశలకు పెద్ద గండి పడింది.
సుప్రీం కోర్ట్ తీసుకున్న షాకింగ్ నిర్ణయంతో బీజేపీ నేతలు ఖంగుతిన్నారు. బలనిరూపణ గడువు కోసం గవర్నర్ ఇచ్చిన 15 రోజులను సుప్రీంకోర్ట్ తోసిపుచ్చింది. ఇరు పార్టీలు వెంటనే బలపరీక్షలో నిలవాలని ఆదేశించింది. దాంతో బీజేపీకి ఖంగుతినక తప్పలేదు. బలనిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు దక్కింది. సీఎం సీటు జేడీఎస్ నేత కుమారస్వామిని వరించింది.