FASTag: నూతన సంవత్సరంలో చేతిలో అది లేకపోతే రోడ్లపై వాహనాలకు నో ఎంట్రీ..నో ఎగ్జిట్. అందుకే ఒక్కసారిగా జనం కొనుగోళ్లు ప్రారంభించారు. ఒక్కరోజులోనే 80 కోట్ల టోల్ వసూలైందంటే ఆ ట్యాగ్ ప్రాముఖ్యత అర్దం చేసుకోవచ్చు..
వాహనదారులందరికీ ఇప్పుడు ఫాస్టాగ్ ( FASTag ) పైనే దృష్టి పడింది. ఇప్పటికే తీసుకున్నవారు ఊపిరి పీల్చుకుంటుంటే..తీసుకోనివారు ఆందోళనగా ఉన్నారు. డిసెంబర్ 31 ( December 31 2020 ) లోగా తప్పనిసరిగా తీసుకుతీరాలి. లేదంటే రోడ్లపై నో ఎంట్రీ..నో ఎగ్జిట్ కూడా. 2021 జనవరి 1వ తేదీ నుంచి దేశంలోని అన్ని 4 చక్ర వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని టోల్‌గేట్ల ( Tollgates ) వద్ద ట్రాఫిక్ నియంత్రించడం, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం.
గడువు ముగుస్తుండటంతో వాహనదారులు ఒక్కసారిగా ఫాస్టాగ్ కొనుగోళ్లు ప్రారంభించారు. డిసెంబర్ 24 వ తేదీన అంటే ఒక్క రోజులో దేశవ్యాప్తంగా వివిధ టోల్‌గేట్ల నుంచి 50 లక్షల ఫాస్టాగ్ అమ్మకాలు ( FASTag sales ) జరిగాయి. అంటే ఒక్కరోజులోనే టోల్ ఆదాయం ( Toll income ) ఫాస్టాగ్ ద్వారా 80 కోట్ల దాటినట్టు నేషనల్ హైవే అథారిటీ ( NHAI ) ప్రకటించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 2.20 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశామన్నారు. ఫాస్టాగ్ ఉంటే టోల్‌గేట్ల వద్ద ప్రయాణీకులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఫాస్టాగ్ ద్వారా సమయం, అటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadkari ) తెలిపారు.