తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనగోడలు దీపా జయకుమార్ ఇంటికి వచ్చిన ఆదాయపన్ను అధికారి ఓ నకిలీ అధికారి అని తేలడంతో విస్తుపోవడం అందరి వంతైంది.నకిలీ ఆదాయపు పన్ను అధికారుల వేషాల్లో రైడ్స్ చేయడం ఇప్పటి వరకు స్పెషల్ 26, గ్యాంగ్ లాంటి సినిమాల్లోనే చూశాం. అయితే సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన స్థానిక పోలీసులను ఆశ్చర్యపోయేలా చేసింది.
వివరాల్లోకి వెళితే.. శనివారం జయలలిత మేనగోడలు దీపా జయకుమార్ ఇంటికి ఐన్‌కమ్ ట్యాక్స్ అధికారి అని చెబుతూ ఓ వ్యక్తి వచ్చారు. తనఐడి కార్డులతో పాటు వారెంట్ పత్రాలు అని చెబుతూ కొన్ని కాగితాలు చూపెట్టడంతో ఆమె కుటుంబీకులతో పాటు దీప భర్త మాధవన్ కూడా నిజంగానే నమ్మేశారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో దీపా జయకుమార్ ఇంట్లో లేకపోవడం గమనార్హం.
అయితే అదే సమయంలో దీప ఇంట్లో ఉన్న ఆమె అడ్వకేట్‌కు... ఐన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఐడి కార్డులో పలు అక్షర దోషాలు కనిపించడంతో తనకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అయితే పోలీసులు వస్తున్న కదలికలు పసిగట్టిన ఈ నకిలీ ఆదాయపు పన్ను అధికారి వెంటనే ఉడాయించారు. ఆ ఇంటి గోడ దూకి పారిపోయారు.
ఆ నకిలీ ఐన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఐడి కార్డులోని ఆధారాలను బట్టి ప్రస్తుతం తనను అన్వేషించాలని భావిస్తామని.. ఆ తర్వాత తదుపరి దర్యాప్తు చేస్తామని తెలిపారు పోలీసులు. అయితే ఈ సంఘటన నిజంగానే జరిగిందా లేక ఇంట్లో కుటుంబీకులే ఏదైనా ప్రణాళిక ప్రకారం చేశారా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నామని అంటున్నారు పోలీసులు
జయలలిత మేనగోడలి ఇంట్లో.. నకిలీ ఐన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హల్చల్..!