భారత సైనికులకు దీపావళి కానుక ఇదే..!

           

Last Updated : Oct 19, 2017, 11:20 AM IST
భారత సైనికులకు దీపావళి కానుక ఇదే..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ యావత్ భారతదేశానికి ట్విటర్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం దీపావళిని ఆయన ఉత్తరాఖండ్, చైనా బోర్డర్ సరిహద్దుల వద్ద కాపుగాస్తున్న సైనికులతో జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన సరిహద్దుల వద్ద కాపుగాస్తున్న సైనికులకు దీపావళి బహుమతి అందించారు. ఇప్పటి వరకు సైనికులు లేదా ఆర్మీ ఆఫీసర్లు డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్‌ను వాడాలంటే 500 రూపాయలను నెలవారీ ఛార్జీల క్రింద చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పటినుండి ఆ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఇకపై వారు ఆ టెర్మినల్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. అలాగే గతంలో నిముషానికి 5 రూపాయలు పడే ఈ ఫోన్ ఛార్జీలు, ఇకపై 1 రూపాయి మాత్రమే పడేవిధంగా ప్రభుత్వం నిబంధనలు సవరించింది. ఈ గురువారం నుండి వారికి ఈ కొత్త ఫోన్ ఛార్జీలు వర్తిస్తాయి. 

సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఈ విషయంపై మాట్లాడుతూ " రిమోట్ ఏరియాలలో పనిచేసే సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, బీఆర్‌ఓ, ఐటిబీపీ జవాన్లు రాత్రనకా, పగలనకా తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటారు.వారు కుటుంబంతో ఎప్పుడైనా మాట్లాడాలంటే, బీఎస్‌ఎన్ఎల్ డీఎస్‌పీటీ సర్వీస్ మీద ఆధారపడాల్సిందే. దేశం కోసం ఎంతో చేస్తున్న సైనికులకు ఆ సర్వీస్ ఛార్జీలు లేకుండా చేసి, వారు తమ కుటుంబాలతో మాట్లాడే వెసులుబాటును మరింత సులభతరం చేసేందుకే ఈ దీపావళి కానుక. జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు" అని తెలియజేశారు.  

Trending News