న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. కరీంనగర్లో మార్చి17న జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తంచేసింది. ''హిందూగాళ్లు.. బొందు గాళ్లు'' అని కేసీఆర్ చేసిన ప్రాస వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని ఎన్నికల సంఘం తమ నోటీసులు పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై ఏప్రిల్ 12లోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం కేసీఆర్‌కి జారీచేసిన నోటీసుల్లో ఆదేశించింది.
ఎన్నికల ప్రచార సభలో హిందూ ఓటు బ్యాంకు రాజకీయాల గురించి విమర్శించే క్రమంలో కేసీఆర్ ఉపయోగించిన పదాలు, చేసిన వ్యాఖ్యలు హిందువులను కించపర్చే విధంగా ఉన్నాయని వీహెచ్‌పీ నేత రామరాజు చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ ఇసి ఈ నోటీసులు జారీచేసింది.