నేడు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించినున్న ఈసీ

నేడు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించినున్న ఈసీ

Last Updated : Oct 6, 2018, 11:28 AM IST
నేడు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించినున్న ఈసీ

భారత ఎన్నికల సంఘం ఎన్నికలు జరగాల్సిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలపై ప్రధాన దృష్టి సారించింది. శనివారం న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం తొలుత నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడిస్తారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తవనుందని.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మినహా మిగితా మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకేదశలో నిర్వహించనున్నారని, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారని పీటీఐ తెలిపింది.

భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈ రాష్ట్రాల్లో అమల్లోకి రానుంది.  

తొలుత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను ఖరారు చేస్తారు. ఎలక్టోరల్ రోల్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తేదీ వివరాలను భారత ఎన్నికల సంఘం వెల్లడిస్తుందని పీటీఐ తెలిపింది.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ రాష్ట్రంలో చిన్న పార్టీలు కూడా తమ ప్రభావాన్ని చూపనున్నాయని వివిధ సంస్థలు చేపట్టిన ఎన్నికల సర్వేలో వెల్లడైంది. అటు బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీకి దిగుతుందని తెలిపారు.

2013లో రాజస్థాన్‌లో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా రాజస్థాన్‌లో బీజేపీ పార్టీ 25 సీట్లను గెలుచుకుంది. కానీ ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన బై పోల్స్‌లో బీజేపీ రెండు లోక్‌సభ, ఒక శాసన సభ సీటును కోల్పోయింది.

కాగా నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాజస్థాన్ గౌరవ్ యాత్రలో భాగంగా అజ్మీర్‌లోని కయద్ విశ్రమ్ స్థలిలో ఏర్పాటు చేసిన భారీ బహింరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Trending News