రైతు బన్ గయా కరోడ్ పతి
రుణం కోసం వెళ్లాడు.. కోటీశ్వరుడయ్యాడు..
అతడో రోజువారీ కూలీ. కానీ ఇప్పుడు కోటీశ్వరుడు. రాత్రికి రాత్రే అతడు ఒక్కసారిగా కోటీశ్వరునిగా మారిపోయాడు. 12 కోట్లకు అధిపతిగా మారాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. ఇంతకీ.. రాత్రికి రాత్రే అన్ని డబ్బులు ఎలా వచ్చాయో తెలుసా..?
చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పొరున్నన్ రాజన్. కేరళ కన్నూరు జిల్లాలోని కూట్టుపరంబ గ్రామం. రైతు కూలీగా పని చేస్తున్నాడు. వ్యవసాయ పనుల కోసం అందరు రైతులు తీసుకున్నట్లే బ్యాంకులో అప్పు తీసుకోవడం.. వ్యవసాయం చేయడం.. అప్పు తీర్చడం .. ఇదీ పరిస్థితి. ఇప్పటికే రాజన్ బ్యాంకుకు 7 లక్షలు అప్పు ఉన్నాడు. కానీ మళ్లీ వ్యవసాయ పనుల కోసం అప్పు కావాలని బ్యాంకుకు వెళ్లాడు. కానీ అతని నిరాశ ఎదురైంది. పాత అప్పు కట్టాలని.. లేనిపక్షంలో కొత్త అప్పు ఇచ్చే పరిస్థితి లేదని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఏం చేసేది లేక నిరాశగా వెనుదిరిగాడు. కానీ తనకు ఉన్న పాత అలవాటు ప్రకారం 300 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. ఇలా తరచుగా లాటరీ టికెట్లు కొంటుండగా .. అతని భార్య రోజూ గొడవపడేది. కానీ ఈసారి తను ఊహించని విధంగా బంపర్ ఆఫర్ తగిలింది.
క్రిస్మస్, న్యూ ఇయర్ లాటరీలో రాజన్ అక్షరాల 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. నిజానికి ఈ బంపర్ డ్రా సోమవారం రోజే ప్రకటించారు. కానీ ఈ విషయం రాజన్ కు తెలియదు. తన ఇంటి దగ్గరలోని లాటరీ అమ్మే దుకాణానికి వెళ్లిన ఆయనకు మంగళవారం నాడు విషయం తెలిసింది. ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు. లాటరీ టికెట్ పట్టుకుని కన్నూరు జిల్లాకు వెళ్లి డబ్బులు తీసుకున్నాడు. లాటరీలో గెలుచుకున్నది 12 కోట్ల రూపాయలు అయినప్పటికీ . . అతనికి 7 నుంచి 8 కోట్ల రూపాయల వరకే రానున్నాయి. మొత్తం డబ్బుల్లో ప్రభుత్వ పన్ను, ఏజెంట్ల కమిషన్ మినహాయించుకుని ఈ డబ్బులు ఇస్తారు. ఈ డబ్బులు ఏం చేస్తారని రాజన్ ను అడిగితే . . తొలుత తనకు ఉన్న బ్యాంకు లోన్ తీర్చేస్తానని .. ఆ తర్వాత ఇల్లు బాగు చేసుకుని .. చిన్న కూతురును కూడా చదివిస్తానని చెప్పాడు.
కేరళలో ప్రభుత్వానికి అతి పెద్ద ఆదాయ వనరుగా లాటరీ బిజినెస్ ఉంది. లాటరీ, మద్యంపై భారీగా ఆదాయం సమకూరుతోంది. రోజూ కేరళ మొత్తంలో 2 లక్షల మంది లాటరీ టికెట్లు కొంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..