2022 సంవత్సరం రైతుల పాలిట వరం కావాలి: నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నమో యాప్ ద్వారా దేశంలోని రైతులతో తన ఆలోచనలను పంచుకున్నారు. 

Last Updated : Jun 21, 2018, 11:41 AM IST
2022 సంవత్సరం రైతుల పాలిట వరం కావాలి: నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నమో యాప్ ద్వారా దేశంలోని రైతులతో తన ఆలోచనలను పంచుకున్నారు. 2022 సంవత్సరానికల్లా రైతుల సంపాదనను రెండింతలు చేయడానికి ప్రభుత్వం అహర్నిశలు ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. తమకు దేశంలోని రైతుల మీద నమ్మకం ఉందని... వారికి కావాల్సిన సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాని తెలిపారు.

ఈ క్రమంలో ప్రధాని ఆధునికత వైపు అడుగులు వేస్తున్న రైతాంగాన్ని ప్రశంసించారు. "ఈ రోజు రైతులు వ్యవసాయంలో సరికొత్త టెక్నాలజీని వాడడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రూపులుగా కలిసి పనిచేస్తున్నారు. వారికి ముడి సరకును అతి తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది" అని ప్రధాని తెలిపారు. అలాగే ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన గురించి, సాయిల్ హెల్త్ కార్డుల గురించి తెలిపారు. 

" ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే రైతులు తమ పంటపై వాతావరణ ప్రభావం గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ స్కీము ప్రీమియం కూడా తక్కువే. తక్కువ ధరకే బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నాం." అని మోదీ తెలిపారు. ఇదే కార్యక్రమంలో ప్రధాని పలువురు రైతులను ప్రశంసించారు. మధ్యప్రదేశ్ రైతు చంపా నినమా కేద్కాంత్ పౌల్ట్రీ వ్యవసాయం ద్వారా తన సంపాదనను ఎలా మెరుగుపరచుకున్నాడో విని తన అభినందనలను ప్రధాని ఆయనకు తెలిపారు.

కేద్కాంత్ లాంటి రైతులు దేశానికి ఆదర్శమని తెలిపారు. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కిం, బెంగాల్ రాష్ట్రాల రైతులతో ముచ్చటించారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయం మంచి ఫలితాలను ఇస్తుందని అభిప్రాయపడ్డారు. బెంగాల్ రాష్ట్రంలో చేపల పెంపకానికి తగు సహాయాన్ని అందిస్తామని తెలిపారు. దేశాభ్యుదయంలో రైతులది ప్రధాన పాత్ర అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. 

Trending News