'కరోనా వైరస్'.. ప్రభావం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. వారికి ఇవ్వాల్సిన కరవు భత్యం ప్రకటనను కేంద్రం వాయిదా వేసింది. జులై 2021 వరకు వారికి కరవు భత్యం ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నామైనందున ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం.. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ఏటా రెండుసార్లు కరవు భత్యాన్ని ప్రకటిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు విశ్రాంత ఉద్యోగులకు కరవు భత్యం ఇస్తారు. ప్రస్తుతం జులై 2020 నుంచి జనవరి 2021 వరకు కరవు భత్యాన్ని ఇవ్వవద్దని నిర్ణయించారు. దీని ప్రభావం 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 61 లక్షల విశ్రాంత ఉద్యోగులపైనా పడుతుంది.
మరోవైపు DA, DRకు సంబంధించి ప్రస్తుతం ఉన్న రేట్లు కొనసాగుతాయని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ మార్చిలోనే నిర్ణయం తీసుకుంది. దీంతో కరవు భత్యం 21 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వానికి కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పన్ను ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఇప్పట్లో కరవు భత్యాన్ని చెల్లించకూడదని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జులైలో మరోసారి కరవు భత్యాన్ని సమీక్షిస్తారు.
కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్థపై అదనపు భారం పడడంతో ఇప్పటికే ప్రధాన మంత్రి, మంత్రులు, రాష్ట్రపతి, ఎంపీల జీతాల్లో 30 శాతం కోత పడింది. అంతే కాకుండా ఎంపీ లాడ్స్ నిధులపైన కూడా రెండేళ్లపాటు సస్పెన్షన్ విధించారు. ఫలితంగా కేంద్రానికి 8 వేల కోట్ల రూపాయల నిధులు మిగలనున్నాయి.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై 'కరోనా' ప్రభావం