Ayodhya Ram Mandir:సాలగ్రామ శిల అంటే ఏమిటి.. ? అయోధ్య రాముడి విగ్రహాన్ని సాలగ్రామ శిలతోనే చేసారా..?

Ayodhya Ram Mandir: దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా శ్రీ రామ నామమే మారుమోగుతోంది.5 శతాబ్డాల సుధీర్ఘ నిరీక్షణ. ఎన్నో దశాబ్దాల పోరాటాలు వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం కల సాకారం అవుతోంది. ఇక భవ్య రామ మందిరంలో కొలువు తీరనున్న రామ్ లల్లా విగ్రహాన్ని సాలగ్రామ శిలతోనే చేసారు. అసలు సాలగ్రామం అంటే ఏమిటి ? విగ్రహాల తయారీకి సాలగ్రామాన్ని ఎందుకు ఉపయోగిస్తారు. అయోధ్య బాల రాముడి విగ్రహం తయారీలో ఏ సాలగ్రామాన్ని ఉపయోగించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 06:46 PM IST
Ayodhya Ram Mandir:సాలగ్రామ శిల అంటే ఏమిటి.. ? అయోధ్య రాముడి విగ్రహాన్ని సాలగ్రామ శిలతోనే చేసారా..?

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో భవ్య రామ మందిరంలో శ్రీరామ చంద్రుడు బాల రాముడుగా నిర్ణయించిన ముహూర్తంలోనే కొలువు తీరనున్నారు. ఈ నెల 23 నుంచి సామాన్య భక్తులకు బాల రాముడు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరంలో కొలువు తీరనున్న రాముడి విగ్రహానికీ ఏ సాలగ్రామ శిలను ఉపయోగించారు. అసలీ సాలగ్రామాలు ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి. అయోధ్య బాల రాముడి కోసం ఏ సాలగ్రామ శిలను ఉపయోగించారనేది చూద్దాం.

రాములోరి జన్మ స్థలం అయోధ్యలోని రామ మందిరంలో కొలువు తీరనున్న సీతా సమేత రామ విగ్రహాల తయారీకి  సాలగ్రామ శిలలను ఉపయోగించారు. పెద్ద ఆలయాల్లో ప్రతిష్ఠించే విగ్రహాలకు సాలగ్రామాన్ని ఎందుకు ఉపయోగిస్తారు. అసలు  సాలగ్రామం శిలకు ఆ పేరు ఎలా వచ్చింది. దీనిలో రకాలు ఉన్నాయా అని చాలామందికి సందేహం కలుగడం సహజం. అయితే ఈ సాలగ్రామం శ్రీ మహా విష్ణువుకి ప్రతీక. అంతేకాదు అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఒక శిల. కలికాలంలో భక్తుల సులభంగా పూజాదిక కార్యక్రమాలను జరుపుకునేందుకు స్వయంగా నారాయణుడే దివి నుండి భువిపై సాలగ్రామ రూపం ధరించి తరించాడని దేవి భాగవతం చెబుతుంది. అందుకనే కలియుగంలో సాలగ్రామ పూజలకు అత్యంత విశిష్టత ఏర్పడింది.

అసలు సాలగ్రామము విషయానికొస్తే.. ఇవి మహా విష్ణుకు ప్రతీకమైనవిగా భావిస్తారు. ఇవి ఒకరమైన విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల పూజాది కార్యక్రమాల సౌలభ్యం కోసం నారాయణుడు స్వయంగా సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. అందుచేతే గృహ దేవతా అర్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు.అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది.అపస్తంబుడు సాలగ్రామ పూజను మొదట పేర్కొన్నట్టు పురాణాల్లో ఉంది. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాల గ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహాన, షోడశ ఉపచార పూజలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

ఇక అయోధ్య రామ మందిరంలో కొలువు దీరనున్న సీతారాముల విగ్రహాలను తయారు చేసేందకు నేపాల్ నుంచి తీసుకుని వచ్చిన సాలగ్రామ శిలలను ఉపయోగించారు. ఈ సాలగ్రామ శిలలు సుమారు 6 కోట్ల సంవత్సరాల పురాతనమైనవగా కార్బన్ డేటింగ్ ద్వారా తెలుస్తోంది. వీటిని నేపాల్‌లోని గండకి నది నుంచి సంగ్రహించారు.

మన దేశానికి ఆనుకుని ఉండే నేపాల్ లోని గండకీ నది సాలగ్రామ శిలలకు ప్రసిద్ధి చెందింది. ఈ సాలగ్రామం.. సాక్షత్ విష్ణు స్వరూపంగా భావిస్తారు భక్తులు. వీటిని అభిషేకించిన జలం పుణ్యప్రదనమైనదిగా భావిస్తారు. సాలగ్రామాన్ని అభిషేకం చేసిన తీర్ధం తీసుకుంటే సకల రోగాలు నశించిపోతాయని పలు సైన్స్ పత్రికలు కూడా ప్రూవ్ చేసాయి.సాలగ్రామాలతో సకల శుభాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషుల వాక్కు.

సాలగ్రామం వెనుక పురాణాల కథ కూడా ఉంది..
విష్ణుమూర్తి .. సాలగ్రామం అనే రాయి రుపాన్ని ధరించడానికి సంబంధించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది బృంద కథ. కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని వివాహామాడుతుంది. బృంద మహా పతివ్రత. జలంధరుడు తన రాక్షస ప్రవృత్తితో దీనజనులతో పాటు దేవతలను సైతం పీడిస్తూ ఉండేవాడు. అంతేకాదు జలంధురుడు పార్వతీ దేవిపై మొహం పెంచుకుని.. శివుని రూపం ధరించి  ఆమె వద్దకు వెళ్ళాడు. దీంతో ఆ జగజ్జనని జలంధురుడిపై కోపంతో శ్రీ మహా విష్ణువును  ఆశ్రయిస్తుంది. ఈ సందర్భంగా బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది.

బృంద పాతివ్రత్య భంగం కలిగితేనే.. లోకకంటకుడైన జలంధురుడి అంతం జరుగుతుందనేది చాముండి ఉవాచ. దీంతో సమస్త లోకం సుఖ సంతోషాలను కోరిన శ్రీ మహా విష్ణువు.. జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు. అనంతరం బృందకు తన నిజ రూపదర్శన భాగ్యం ఇస్తాడు. అసలు విషయం తెలుసుకున్న బృంద.. విష్ణుమూర్తిని శిలగా మారమని శపిస్తుంది. అలా శిల సాలగ్రామం అని పురాణాల కథ.

సాలగ్రామ శిలలు ఎంత చిన్నవిగా ఉంటె అంత విశిష్టతను కలిగి ఉంటాయి. ఈ శిలలపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తారు.

సాలగ్రామంపై ఒక చక్రం ఉంటే సుదర్శనమని.. రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణుడని.. మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడనీ.. నాలుగు చక్రాలు ఉంటే జనార్ధుడు అనీ.. 5 చక్రాలు ఉంటే వాసుదేవుడనీ.. 6 చక్రాలు ఉంటే ప్రద్యుమ్నుడని అంటారు. అంతేకాదు ఏడు చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని సంకర్షణుడు అనీ, ఎనిమిది చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని పురుషోత్తముడు అనీ.. 9 చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని నవవ్యూహమని.. 10 చక్రాలు ఉంటే దశావతారమనీ అంటారు. ఇక సాలాగ్రామానికి పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడు పేరుతో పిలుస్తారు. పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు అనీ అంటారు. పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని అనంతమూర్తి అని పిలుస్తారు.

సాలగ్రామన్ని ఆవుపాలతోగానీ, పంచామృతంతోగానీ శుద్ధి చేసి.. నియమ నిష్టలతో పూజించాలి. ఇంట్లో పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం సమర్పించాలి. కుటుంబసభ్యులు తప్ప ఇతరులు సాలగ్రామన్ని దర్శించరాదని పురాణ కథనం.ఏది ఏమైనా అయోధ్యలో మరికొన్ని గంటల్లో కొలువు తీరనున్న బాల రాముడి విగ్రహం నేపథ్యంలో సాలగ్రామ శిలలు మరోసారి వార్తల్లో నిలిచాయి.

Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్

Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News