దశాబ్ధాల తరబడిగా భారత్‌తో నిత్యం కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్‌కి, పాక్‌తో కలిసి భారత్‌కి పక్కలో బళ్లెంలా తయారు కావాలని చూసిన చైనాకు పోక్రాన్ అణు పరీక్షతో ధీటైన సమాధానం ఇచ్చిన ధీరుడు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి. 1998లో భారత ప్రధాని పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఇండియన్ ఆర్మీకి చెందిన పోక్రాన్ టెస్ట్ రేంజ్లో పోక్రాన్-II అణు పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ధైర్యశాలి ఆయన. వాజ్‌పేయి తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేయడంతోపాటు భారత్‌కి ఇరువైపుల ఉన్న శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టింది. 1974లో తొలిసారి ఈ అణు పరీక్షలు జరగ్గా ఆ తర్వాత 24 ఏళ్లకు మళ్లీ అణు పరీక్షలకు సై అన్న సాహసి అటల్ బిహారి వాజ్ పేయినే. ఈ పరీక్షల్లో ఐదు అణు బాంబుల సామర్థ్యాన్ని పరీక్షించడంతో వాజ్‌పేయి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం భారత్‌ను పూర్తి స్థాయిలో అణు సామర్థ్యం కలిగిన దేశాల సరసన నిలబెట్టింది.
1974లో తొలిసారి అణు పరీక్షలను జరిపినప్పుడు ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ తర్వాత మళ్లీ 24 ఏళ్లపాటు ఏ ప్రధాని రెండోసారి అణు పరీక్షలు జరిపే సాహసం చేయలేదు. అయితే, 1998లో మే 11న అప్పటి ప్రధాని వాజ్‌పేయి అణు పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాక్, చైనాలు ప్రపంచ దేశాల ముందు భారత్‌ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. వాజ్‌పేయి వాటన్నింటినీ ఎదుర్కుని హమ్ కిసీ సే కమ్ నహీ హై అనిపించుకున్నారు.