మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి చికిత్సపై హెల్త్ బులెటిన్ విడుదల

వాజ్‌పేయి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ హెల్త్ బులెటిన్ 

Last Updated : Jun 12, 2018, 06:13 PM IST
మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి చికిత్సపై హెల్త్ బులెటిన్ విడుదల

తరచుగా జరిగే వైద్య పరీక్షల నిమిత్తమై సోమవారం ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి ప్రస్తుతం మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం అటల్ బిహారి వాజ్‌పేయిని ఆస్పత్రిలో చేర్పించారని తెలిసినప్పటి నుంచీ ఆయన్ని అభిమానించే ప్రజల్లో, బీజేపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. సోమవారం రాత్రికి రాత్రే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ అగ్ర నేత ఎల్.కే. అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వంటి నేతలు వాజ్‌పేయిని పరామర్శించేందుకు ఎయిమ్స్‌ని సందర్శించడంతో ఆయనకు ఏదో జరుగుతోందనే ఆందోళన మరింత రెట్టింపయ్యింది. 

వాజ్‌పేయి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం మధ్యాహ్నం స్పందించిన ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు.. వాజ్‌పేయి చికిత్సకు స్పందిస్తున్నారని స్పష్టంచేశాయి. మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్స్‌కి చికిత్స పూర్తయి కోలుకునే వరకు ఆయనకు ఆస్పత్రిలోనే చికిత్స నిర్వహించడం జరుగుతుందని ఎయిమ్స్ స్పష్టంచేసినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది. ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో నిపుణులైన వైద్యుల బృందం వాజ్‌పేయికి చికిత్స అందిస్తోంది. వాజ్‌పేయికి ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా వ్యక్తిగత వైద్యుడిగానూ వ్యవహరిస్తున్నారు.  

Trending News