నిజాయతీకీ బహుమానం.. 51వ సారి బదిలీ

   

Last Updated : Nov 14, 2017, 06:42 PM IST
నిజాయతీకీ బహుమానం.. 51వ సారి బదిలీ

నిజాయతీ పరులైన ఐఏఎస్ అధికారులకు బదిలీలు తప్పడం లేదు. స్థానిక అవినీతిపరులను కట్టడి చేయడం.. నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లే స్థానిక పాలకులను ఎదిరించడం వల్ల వారు ఊహించని పరిణామాలు చూడాల్సి వస్తుంది. పదే పదే బదిలీలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవలే హర్యానాకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా విషయంలో కూడా అదే జరిగింది. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన ఖేమ్కా, 2012లో తొలిసారిగా వార్తల్లో నిలిచారు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకి సంబంధించిన లాండ్ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న ఖేమ్కా వెంటనే బదిలీ అయిపోయారు. మళ్లీ ఇటీవలి కాలంలో హర్యానాలో మనోహర్ లాల్ ఖత్తార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా బదిలీ అయిన 13 మంది ఆఫీసర్లలో ఖేమ్కా కూడా ఒకరు. ఈ బదిలీతో.. తన 52 ఏళ్ల కెరీర్‌లో 51 సార్లు బదిలీ అయిన ఘనత తనకే దక్కిందని ఖేమ్కా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 

విచిత్రమేంటంటే.. హర్యానా సామాజిక న్యాయ శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఖేమ్కా బదిలీ అవ్వడం గమనార్హం. ఆ సెక్షన్ నుండి బదిలీ అయ్యి హర్యానా క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు ఖేమ్కా. అయితే అనధికారికంగా ప్రభుత్వ అధికారుల కారును వాడుకుంటున్న మంత్రిని.. దానిని తిరిగి డిపార్టుమెంటుకి అప్పగించాల్సిందని ఖేమ్కా అడిగినందుకే ఆయనను బదిలీ చేశారని కొందరు అంటున్నారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా కాకుండా.. కొందరు రాజకీయ నాయకుల కుటిలనీతి వలన ఆఫీసర్ల బదిలీలు జరగడం అనైతికమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు ఖేమ్కా. కాంగ్రెసు హయంలో కూడా రాబర్ట్ వాద్రా కేసులో తనపై ఒత్తిడి వచ్చిందని చెబుతుంటారు ఖేమ్కా. అయినా ఎన్ని బదిలీలు ఎదురైనా, నిజాయతీగా పనిచేసుకొని పోవడమే తన నైజమని చెబుతుంటారు ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి.

Trending News