పాక్ ఆర్మీ చేతిలో వేధింపులకు గురైన ఐఏఎఫ్ పైలట్ అభినందన్ వర్థమాన్ ?

పాక్ ఆర్మీ చేతిలో వేధింపులకు గురైన ఐఏఎఫ్ పైలట్ అభినందన్ వర్థమాన్ ?

Last Updated : Mar 3, 2019, 11:57 AM IST
పాక్ ఆర్మీ చేతిలో వేధింపులకు గురైన ఐఏఎఫ్ పైలట్ అభినందన్ వర్థమాన్ ?

న్యూఢిల్లీ: భారత గగనతలంపైకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలను వెంటాడుతూ వెళ్లి పాక్ ఆర్మీ చేతికి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్‌లో తీవ్ర మానసిక వేధింపులకు గురైనట్టు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో తాను ఎటువంటి ఇబ్బందులకు గురికాలేదని అభినందన్ చెప్పినప్పటికీ.. వాస్తవానికి అక్కడ అభినందన్ భరించలేని మానసిక వేధింపుల బారినపడినట్టు తెలుస్తోందని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. బుధవారం రాత్రి పాకిస్తాన్ గగనతలంపై తన యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ ఆర్మీ కూల్చేయడంతో అందులోంచి ప్రాణాలతో బయటపడిన అభినందన్.. పారాచూట్ సహాయంతో పాక్ భూభాగంలో సురక్షితంగా కిందికి దిగిన సంగతి తెలిసిందే. పారాచూట్ సహాయంతో కిందికి దిగిన చోటే పాకిస్తానీయుల దాడిలో గాయపడిన అభినందన్‌ను అదే రోజు రాత్రి పాక్ ఆర్మీ తమ కస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత చోటుచేసుకున్న అనేక నాటకీయ పరిణామల నేపథ్యంలో 59 గంటల తర్వాత శుక్రవారం రాత్రి పాక్ ఆర్మీ అభినందన్‌ను అమృత్‌సర్‌కి సమీపంలోని వాఘా బార్డర్ వద్ద ఇండియన్ ఆర్మీకి అప్పగించిన సంగతి తెలిసిందే.

భారత్‌కి తిరిగొచ్చిన అనంతరం ప్రస్తుతం ఢిల్లీలోని మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభినందన్ ని ఇవాళ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ చేతికి చిక్కినప్పటి నుంచి తిరిగి భారత్ కి చేరుకున్నప్పటి వరకు జరిగిన వరుస పరిణామాలను అభినందన్ రక్షణ శాఖ మంత్రికి వివరించినట్టు సమాచారం.

Trending News