సుప్రీం కోర్టులో 'ఆధార్‌'కి అగ్ని పరీక్ష !

ఆధార్ లింకింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ దాఖలైన విజ్ఞప్తులపై నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఆధార్ గురించి తెలుసుకోవాల్సిన పలు కీలక అంశాలపై ఓ లుక్కేద్దాం.

Last Updated : Jan 17, 2018, 11:58 AM IST
సుప్రీం కోర్టులో 'ఆధార్‌'కి అగ్ని పరీక్ష !

బ్యాంకులు, టెలికాం కంపెనీలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇన్‌కమ్ టాక్స్ వంటి వివిధ విభాగాలు ఆధార్ కార్డు నెంబర్‌తో తమ ఖాతాలని జత చేయడం తప్పనిసరి అనే నిభందన విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మార్చి 31వ తేదీని అందుకు చివరితేదీగా కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆధార్ నెంబర్‌ని వివిధ ఖాతాలకి జత చేయడం తప్పనిసరి అనే నిబంధనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ పలువురు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఆధార్ లింకింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ దాఖలైన విజ్ఞప్తులపై నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఆధార్ గురించి తెలుసుకోవాల్సిన పలు కీలక అంశాలపై ఓ లుక్కేద్దాం.

> ఆధార్‌ని సవాలు చేస్తూ మొట్టమొదటిసారి పిటిషన్ దాఖలైన తర్వాత ఐదేళ్లకు సుప్రీం కోర్టు ఆధార్‌పై విచారణ చేపట్టింది. 
> సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లని విచారించనుంది. 
> అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కేంద్రం ఆధార్‌ని తప్పనిసరి చేయడంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ దాఖలైన పిటిషన్లని ఒకేసారి విచారించేందుకు రాజ్యంగబద్ధంగా ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు గతేడాది నవంబర్ 27న సుప్రీం కోర్టు ప్రకటించింది. 
> వ్యక్తిగత వివరాలను గోప్యంగా వుంచడంలో ఆధార్ విఫలమవుతోందని, వ్యక్తిగత భద్రతకు, స్వేచ్ఛకు ఆధార్ తూట్లు పొడుస్తోందని విమర్శిస్తూ దాఖలైన అభ్యంతరాల్లో వాస్తవం లేదని, ఆధార్‌ని కొనసాగించాలని కేంద్రం సుప్రీం కోర్టుని కోరుతూ వస్తోంది. 
> ఆధార్ వ్యవస్థ పూర్తిగా లోపాలమయమని, కేవలం రూ.500 చెల్లిస్తే చాలు ఎవరైనా సరే ఇతరుల ఆధార్ వివరాలు పొందవచ్చని నిరూపిస్తూ ఇటీవల ది ట్రిబ్యూన్ మ్యాగజైన్ బట్టబయలు చేయడం ఆధార్ పై మరిన్ని విమర్శలకు దారితీసేలా చేసింది.
> ది ట్రిబ్యూన్ మ్యాగజైన్ చేసిన ఆరోపణలని ఖండించిన యుఐడీఏఐ సంస్థ.. 12 అంకెల ఆధార్ నెంబర్ స్థానంలో వర్చువల్ ఐడీ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు స్పష్టంచేసింది. సిమ్ కార్డు వెరిఫికేషన్ లాంటి వివిధ అవసరాలకు ఆ వర్చువల్ ఐడీని వినియోగించుకోవచ్చు అని యుఐడీఏఐ స్పష్టంచేసింది. ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి తమ ఆధార్ కార్డు వివరాలు సమర్పించడం ద్వారా ఆధార్ యూజర్లు ఈ వర్చువల్ ఐడీని పొందవచ్చు.
> ఆధార్ వివరాలు తస్కరించడానికి వీలు లేకుండా 'బయోమెట్రిక్ లాక్'తో అదనపు రక్షణ కల్పిస్తున్నట్టు యుఐడీఏఐ స్పష్టంచేసింది. 
> 2018, జులై 1 నుంచి ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు యుఐడీఏఐ తేల్చిచెప్పింది. ఆధార్ వివరాల గోప్యతకు తాము తీసుకుంటున్న అదనపు చర్యల్లో భాగమే ఈ నూతన విధానం అని యూఐడీఏఐ పేర్కొంది. 
> గతంలో వేలిముద్రలు, కనుపాపలు (ఐరిష్) ఆధారంగా ఆధార్ నమోదు, వినియోగం జరిగేది. అయితే, ఇకపై ఈ రెండు పద్దతులకి అదనంగా ఫేస్ రికగ్నిషన్ కూడా అందుబాటులోకి రానుందన్నమాట.

Trending News